Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 07 Aug 2022 17:00 IST

1. సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణకు మంచిది కాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే అక్కసుతో తమ అధికారం పోతుందనే భయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభద్రతా భావంతోనే వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Video: బాసర ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్‌ తమిళిసై


2. నీతి ఆయోగ్‌ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది: హరీశ్‌రావు

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపాకు వంతపాడుతూ నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నీతిఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదంటూ నీతిఆయోగ్‌ తప్పుడు ప్రకటన చేసిందని ఆయన ఆరోపించారు.

3. తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెరాసను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాసకు రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

4. బాక్సర్ల పసిడి పంచ్‌.. అమిత్‌ పంగల్‌, నితూ గంఘాస్‌కు స్వర్ణాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌లు పతకాలు తెచ్చిపెడుతున్నాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ప్రత్యర్థి ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. నితూ సైతం ఇంగ్లాండ్‌కే చెందిన ప్రత్యర్థి జేడ్‌ రెస్థన్‌పై పంచుల వర్షం కురిపించింది. మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.


Video: ఉచితంగా రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్.. చిన్నారి ఆరోగ్యానికి భరోసా


5. అరటిపండే కదా తీసి పారేయకండి..!

చక్కని పసుపు, బంగారం రంగులో ఉండే అరటి పండ్లంటే అందరికీ ఇష్టమే..ఎన్నో పోషకాలుండే ఈ పండ్లతో ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కానీ అరటి పండ్లపై నల్లటి మచ్చ ఉంటే హాని కారకమని చాలా మంది నమ్ముతుంటారు. అరటి పండ్లపై నల్లని మచ్చలుంటే కుళ్లినవని కాదు..నలుపు, గోధుమవర్ణం మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచివని నిపుణులు చెబుతున్నారు.

6. రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణ ఆగస్టు 24-28 తేదీల్లో

సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4న వాయిదా పడిన సీయూఈటీ-యూజీ పరీక్షను ఈ నెల 24-28 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. వీరికి కొత్త అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. తొలుత 12, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, వరుస పండుగల నేపథ్యంలో పరీక్ష తేదీల్ని మార్చాలని పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది.

7. కెనడాలో 10లక్షల ఉద్యోగాలు ఖాళీ..!

కెనడాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఆ దేశ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. దీనికి తోడు కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్‌ వయస్సుకు దగ్గరపడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్‌ పెరుగుతోంది.


Video: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నియామకాల్లో అవినీతి.. భరోసా లభించని బాధితులు


8. జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!

తమ దేశానికి  చెందిన జపరోషియా అణు విద్యుత్తు కేంద్రం.. రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ప్లాంట్‌ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతింది. దీనిలోని నైట్రోజన్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఓ సహాయక భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కీవ్‌, మాస్కో పరస్పరం నిందారోపణలు చేసుకొంటున్నాయి. 

9. ఫైనల్‌లోకి అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు

కామన్వెల్త్‌ చివరి దశకు చేరుకుంటున్న వేళ భారత క్రీడాకారులు అదరగొట్టేస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లి మరో మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయ సాధించింది.

10. మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఐదు రోజులు ఇంటర్నెట్‌ బంద్‌

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఐదు రోజులపాటు అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి బిష్ణోపూర్‌లోని ఫౌగాక్చావో ఇఖాంగ్‌ వద్ద దుండగులు ఓ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన అక్కడ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘ వ్యతిరేక శక్తులు సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని