Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 08 Aug 2022 16:56 IST

1. భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో మెరిసిన పీవీ సింధు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.

2. 5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు..!

రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేయడం ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రయాణాలు చేయాలంటే కొన్ని రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందే. అదే రద్దీ రూట్లలో అయితే ఇంకా ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల ముందు ప్రయాణాలు నిర్ణయమైతే తత్కాలే బుకింగే దిక్కు. ఒకవేళ అందులోనూ టికెట్‌ దొరక్కపోతే ఇక ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే.

3. వరుసగా రెండో ఏడాదీ అంబానీ వేతనం ‘సున్నా’

అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ ఒక్క రూపాయి వేతనం కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆయన వేతనాన్ని ‘సున్నా’  చూపిస్తూ రిలయన్స్‌ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ 2021-22లో ప్రకటించారు. దాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరానికీ కొనసాగించారు.

4. రాజగోపాల్‌ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు: జీవన్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి సెమీ ఫైనల్‌ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన.. తెరాస మునిగిపోయే పడవ అన్నారు. కాంగ్రెస్‌ గోవు లాంటిది, భాజపా పులి లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు.

5. దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి: కేసీఆర్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో సీఎం కేసీఆర్‌ త్రివర్ణ పతాకం ఆవిష్కరించి వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జాతిపిత గాంధీజీకి నివాళులు అర్పించి సీఎం మాట్లాడారు.‘‘నేటి తరానికి స్వాతంత్ర్య పోరాట ఘటనలు తెలియవు. అనేక పోరాటాలు, త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దారుణంగా అణచివేసింది. ఏ దేశానికైనా స్వాతంత్ర్యం..

6. నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్‌

‘‘సినీతారల జీవితం అనుకున్నంత సౌకర్యవంతంగా ఉండదు. ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వొద్దు అని మా అమ్మ శ్రీదేవి ఓసారి నాతో చెప్పారు’’ అని నటి జాన్వికపూర్‌ అన్నారు. ‘గుడ్‌లక్‌ జెర్రీ’తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ప్రతి క్షణం అమ్మని ఎంతగానో మిస్‌ అవుతున్నా. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేపేది. ఆమె ముఖాన్ని చూడకుండా నా రోజువారీ పనులు మొదలుపెట్టేదాన్ని కాదు..

7. వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌

పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు. అదే చేసింది భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌. గతేడాది ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరిస్థితుల నడుమ ఓటమిపాలైంది. అయితే.. అంత తేలిగ్గా జీవితానికి తల వంచలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఏడాది తిరగకుండానే కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించింది.

8.  స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు: భట్టి

రాష్ట్రంలో అకాల వర్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వరద నష్టంపై ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేయలేదని తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించిన ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవన్నారు.

9. సంజయ్‌ మరో 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి..!

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనను మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గోరేగావ్‌ శివారులోని పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

10. తెరాసలో భూకంపం రాబోతోంది: మురళీధర్‌రావు

హైదరాబాద్‌: విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నా.. దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్లడం లేదని భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు అన్నారు. ద్రవ్యోల్బణం ప్రమాదం అంచున దేశం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డాలర్‌తో రూపాయి పతనం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts