Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 11 Aug 2022 17:17 IST

1. పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థలో మార్పులు: సీఎం జగన్‌

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద మూడో విడత రూ.694 కోట్ల నిధులను బటన్‌ నొక్కి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉన్నత విద్యకు ఫీజు ఎంత ఉన్నా తమ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778కోట్లనూ తామే చెల్లించామన్నారు.

2. కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా ప్రచారానికి ఈసీ బ్రేక్‌!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన ప్రచారానికి బ్రేక్‌ పడింది. ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ భాజపా చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)నిలుపుదల చేసింది. ఆ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు భాజపా అనుమతి కోరగా ఎన్నికల సంఘం నిరాకరించింది.


Video: పేద ఆడబిడ్డల కోసం ఆ పథకాలు తెచ్చాం: కేటీఆర్‌


3. ఆ బకాయిలపై సమాధానం చెప్పండి: ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ రాజధాని కోసం పనిచేసిన ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సంస్థ గతంలో రాజధాని నిర్మాణ ప్రణాళిక, భవన ఆకృతులను రూపొందించింది. 2019 జూన్‌ తర్వాత నుంచి రావాల్సిన బకాయిలపై పలుమార్లు అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)కి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

4. ప్లీజ్‌.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన

సుప్రీంకోర్టులో పలువురు జడ్జిలు, సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ కీలక విజ్ఞప్తి చేశారు. కోర్టు రూమ్‌లలో న్యాయవాదులంతా మాస్కులు ధరించాలని సూచించారు. గురువారం కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రారంభించడానికి ముందు సీజేఐ మాట్లాడుతూ.. ‘‘దయచేసి మాస్కులు పెట్టుకోండి. మన సిబ్బందితో పాటు జడ్జిలూ కరోనా బారినపడుతున్నారు. అందువల్ల కోర్టు రూమ్‌లలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించండి’’ అని కోరారు.

5. విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్‌ స్మోకింగ్‌.. డీజీసీఏ సీరియస్‌..!

ఇటీవల విమాన ప్రయాణాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా నిబంధనలు అతిక్రమిస్తూ ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన విమాన ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తోంది. స్పైస్‌ జెట్‌ విమానంలో సీట్లలో పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన అధికారులు.. ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.


రివ్యూ: లాల్‌ సింగ్‌ చడ్డా


6. దేశానికి ఏం అవసరమో.. బిహార్‌ అదే చేసింది: తేజస్వీ

దేశానికి ఏం అవసరమో బిహార్‌ అదే చేసిందని.. దేశానికి తాము ఒక మార్గాన్ని చూపించామని ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అన్నారు. తమ యుద్ధం నిరుద్యోగంపైనేనన్నారు. పేదలు, యువత పడుతున్న బాధలు సీఎం నీతీశ్‌కు తెలుసన్నారు. అందుకే యువత, పేదలకు నెల రోజుల్లోపే భారీగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించారు. మహాకూటమి చాలా బలమైందని.. ప్రతిపక్షంలో భాజపా ఒక్కటే మిగిలిందన్నారు. మతపరమైన ఉద్రిక్తతల్ని వ్యాప్తి చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా అంతం చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

7. ‘కొవిడ్‌’తో కిమ్‌కు తీవ్ర అనారోగ్యం..!

కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్‌ ప్రపంచం అల్లాడిన సమయంలో ఒక్క కేసు కూడా నమోదుకాని ఉత్తరకొరియాలో ఇటీవల వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు. అదే సమయంలో దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు.

8. పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!

దాయాది దేశం పాకిస్థాన్‌ అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. నిత్యావసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాని షహబాజ్ షరీఫ్‌, పీఎంఎల్‌ - ఎన్‌ పార్టీని విమర్శిస్తూ.. ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ ధరల మధ్య నా పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?’’ అంటూ ఆమె కన్నీటితో ప్రశ్నించారు.


Video: కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల


9. భారత్‌లో ప్రారంభమైన స్నాప్‌చాట్‌ ప్రీమియం.. అదనపు ఫీచర్లివే!

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సోషల్‌ మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని ప్రవేశపెట్టింది. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు స్నాప్‌చాట్‌+ పేరిట అదనపు ఫీచర్లను అందించేందుకు సిద్ధమైంది. ధరల విషయంలో ఆచితూచి వ్యవహరించే భారతీయులను దృష్టిలో ఉంచుకొని నామమాత్రపు ధరకే ప్రీమియం సేవలను తీసుకొచ్చింది. స్నాప్‌చాట్‌+ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకునేవారు ప్రతినెలా రూ.49 చెల్లిస్తే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధర 3.99 డాలర్లుగా ఉంది. 

10. కార్తిక్‌ మంచి ఫినిషరే.. కానీ వీళ్లే అసలైన ఫినిషర్లు: మాజీ క్రికెటర్‌

మ్యాచ్‌ను అద్భుతంగా ముగించి.. జట్టును గెలిపించే ఫినిషర్లు అరుదుగా ఉంటారు. ఇటీవల భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలోకి  రీ-ఎంట్రీ ఇచ్చిన దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. మ్యాచ్‌ చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌కు ఎంపిక చేసిన బృందంలోనూ చోటు సంపాదించాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు డీకే ఈ కోటాలోనే బెర్త్‌ ఖాయం చేసుకుంటాడని క్రికెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని