Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Sep 2022 16:58 IST

1. ఏపీని మూడు రాష్ట్రాలు చేస్తే.. ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల కంటే 3 రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలా చేస్తే సీఎం పదవి కోసం జగన్‌ కుటుంబంలో ఉన్న గొడవ తీరుతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో మూడు రాజధానుల గొడవ నడుస్తోందని.. అక్కడ మూడు రాజధానుల కంటే మూడు రాష్ట్రాలు చేసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులవుతారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వర్షం

భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్‌,  నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్‌, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విద్యుత్‌ బకాయిలపై చర్చ లేకుండానే ముగిసిన ‘విభజన’ పంచాయితీ

విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను ఏపీ, తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ కోరగా.. ఇప్పటికే ఇచ్చిన రూ.1500కోట్ల ఖర్చుల వివరాలు ఇవ్వాలని హోంశాఖ సూచించింది. రాజధాని కోసం శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రూ.29వేల కోట్లు ఇవ్వాలని అడగ్గా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ అవార్డు

మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ (Dada Saheb Phalke)ప్రధానమైనది . ఆ అవార్డుకు బాలీవుడ్‌ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ (Asha Parekh) ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. 2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో భాగంగా సెప్టెంబరు 30న కేంద్ర ప్రభుత్వం ఆశాకు అవార్డును ప్రదానం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫెమా నిబంధనల ఉల్లంఘన.. తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ విచారణకు హాజరైన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు రెండు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..

ప్రభాస్‌ (Prabhas) అభిమానులతోపాటు యావత్‌ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం కావటంతో ప్రారంభం నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూశారు. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భువి ఫామ్‌ తగ్గడానికి కారణమదే.. సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్య

టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడు పూర్తిగా లయ తప్పుతున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్‌తో ఇటీవల ముగిసిన ఆసీస్‌తో సిరీస్‌లోనూ ఆఖరి ఓవర్లలో భువి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. త్వరలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అతడి ఫామ్‌పై ఆందోళనలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Jio 5G smartphone: జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉండొచ్చు?

కోట్లాది మంది 2జీ, 3జీ వినియోగదారులను 4జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్‌.. జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా దాని ధరను రూ.4,499గా నిర్ణయించింది. ఇటీవల జరిగిన రిలయన్స్‌ వార్షిక సమావేశంలో 5జీ ఫోన్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో సర్వత్రా ధరపై ఆసక్తి నెలకొంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  రతన్‌జీకి ఉత్తేజాన్నిచ్చేది ఇదే..

టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా యువతకు ఆదర్శంగా ఉంటారు. ఆయన చెప్పే మాటలు స్ఫూర్తినిస్తుంటాయి. ఆయన వ్యాపార విలువలు ఎందరికో ఆచరణీయం. మరి, ఈయన్ని ఉత్తేజపరిచే అంశమేంటో తెలుసా..? తాజాగా ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తకు చెందిన వీడియో క్లిప్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఆ విషయాన్ని వెల్లడించారు. దానిని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Ukraine: ఘోరం.. ఇతడు అతడేనా..?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎన్నో హృదయవిదారక దృశ్యాలను కళ్లముందుంచింది. ఏడు నెలలు గడిచినా యుద్ధం కొనసాగుతుండడంతో.. ఎన్నో దయనీయ దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రష్యా చెర నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుల దుస్థితిని ఆ దేశం వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికిబయటపడ్డాడంటూ మైఖైలో దియనోవ్‌ అనే సైనికుడి చిత్రాలను షేర్ చేసింది. అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేస్తున్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని