Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 04 Oct 2022 16:57 IST

1. Chiranjeevi: భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను: చిరంజీవి వ్యాఖ్య

ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. బుధవారం ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర సమాధానాలిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. నేడు ఆఖరి మ్యాచ్‌.. శ్రేయస్‌, సిరాజ్‌లకు చోటు కల్పిస్తారా..?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా మంగళవారం ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే టీ20 ప్రపంచకప్‌ ముందు ఉన్న ఆన్ని ఆప్షన్లు చెక్‌ చేసుకుని, జట్టును పటిష్ఠం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.  అలాగే వరుస మ్యాచ్‌లు ఆడుతున్న వారికి రెస్ట్‌ కూడా ఇచ్చినట్లు అవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Nobel Prize 2022: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

2022 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి (Nobel Prize 2022) ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ  ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. JK: అమిత్‌ షా కీలక ప్రకటన.. ఆ వర్గానికి కోటా అమలుకు హామీ!

జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి  త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బెడిసికొట్టిన మస్క్ ‘శాంతి ప్రణాళిక’.. కుబేరుడిపై జెలెన్‌స్కీ కౌంటర్ ఓటింగ్‌..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక బెడిసికొట్టింది. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో సహా పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. చిక్కుకుపోయిన 29 మంది పర్వతారోహకులు!

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఊహించని ప్రమాదం! అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం(Avalanche) కారణంగా 29 మంది ట్రైనీ పర్వతారోహకులు(Mountaineers) చిక్కుకుపోయారు. ఇక్కడి ద్రౌపది దండా-2 శిఖరాగ్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ(Pushkar Singh Dhami) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. యుద్ధం పేరుతో ఎవర్నీ చంపలేను.. సైన్యంలో చేరలేక రష్యన్‌ ర్యాపర్‌ ఆత్మహత్య..!

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Ukraine Crisis) తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతోన్న రష్యా.. నిర్బంధ సైనిక సమీకరణను (Military mobilisation) ముమ్మరం చేస్తోంది. ఇందుకు రష్యా పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సైన్యంలో చేరాల్సి వస్తుందనే భయంలో ఎంతోమంది పౌరులు ఇప్పటికే దేశాన్ని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైన్యంలో చేరాలంటూ నోటీసులు అందుకున్న ఓ రష్యన్‌ ర్యాపర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. Mobile Towers: 500 రోజులు.. ₹26,000 కోట్లు.. 25,000 టవర్లు!

దేశవ్యాప్తంగా 25,000 మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు కావాల్సిన రూ.26,000 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్ని ‘యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌’ నుంచి ఇవ్వనున్నట్లు టెలికాం శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ టవర్ల ఏర్పాటు ప్రక్రియను ‘భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌’ చేపట్టనుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. Adipurush: ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌కు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌!

ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్‌’ టీజర్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. వీఎఫ్‌ఎక్స్‌ పేలవంగా ఉందని, కార్టూన్‌ సినిమాను తలపిస్తోందంటూ ప్రభాస్‌ అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తాజాగా ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ ఓంరౌత్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. హిందూ దేవతలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్‌!

అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల ర్యాలీకి దోహదం చేశాయి. నిఫ్టీ50 ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా పెరిగి 17,200 ఎగువకు చేరింది. సెప్టెంబరు 23 తర్వాత నిఫ్టీ మళ్లీ ఈ స్థాయిని అందుకుంది. మరోవైపు సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా ఎగబాకి 58,099.94 వద్ద గరిష్ఠానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని