Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండిTop Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Updated : 25 Mar 2023 15:57 IST

1. చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసు ఆంక్షలు

తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం కుప్పంలో తలపెట్టిన పర్యటనపై పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోల మీద ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ఆధారంగా చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాల్సిందిగా పలమనేరు పోలీసులు కుప్పం తెదేపా నాయకులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు

ఏపీ సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు. సభాస్థలి వద్ద దిగుతుండగా బస్సు కదలడంతో ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న మరో వాహనం వృద్ధురాలి కాళ్ల పైనుంచి వెళ్లింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


3. వారి భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేం : సుప్రీం

భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల భావ ప్రకటనపై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని తెలిపింది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్‌ స్వాతంత్ర్యంపై ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్‌

దిల్లీ మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేందర్‌సింగ్‌తోపాటు ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులకు బెయిల్‌ మంజూరైంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ సందర్భంగా రౌస్‌ అవెన్యూ కోర్టు వారికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా?: ఎంపీ రఘురామ ఎద్దేవా

ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ (CM Jagan) కుటుంబం ఐదేళ్లు రోడ్లపైనే ర్యాలీలు, సభలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మీతో పాటు కుటుంబంమంతా ఐదేళ్లు రోడ్లపైనే సభలు, ర్యాలీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా?’’ అని రఘురామ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. వైద్యసేవల్లో దేశానికి తెలంగాణ దిక్సూచి: హరీశ్‌రావు

పేదలకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని, వైద్య సీట్లలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. చౌటుప్పల్‌లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్‌ కేంద్రాన్ని (dialysis Center) జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్‌, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.వైకుంఠ ఏకాదశి.. రికార్డుస్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా తితిదేకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్కరోజులోనే రూ.7.68కోట్ల ఆదాయం వచ్చినట్లు తితిదే వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌ 23న లభించిన రూ.6.31కోట్లే ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం. తాజాగా వైకుంఠ ఏకాదశి రోజున వచ్చిన మొత్తం దాన్ని అధిగమించినట్లయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.ఆ ఇద్దరే ప్రపంచకప్‌ గెలిపిస్తారని అనుకుంటే.. సరికాదు : కపిల్‌ దేవ్‌

ఈ ఏడాది టీమ్‌ఇండియా(Team India) ముందు ప్రతిష్ఠాత్మక సిరీస్‌లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వన్డే ప్రపంచ కప్‌(ODI World Cup 2023 ). సొంతగడ్డపై జరిగే ఈ మెగా టోర్నీని గెలవాలంటే.. భారత జట్టు ఇప్పటి నుంచే మంచి ప్రణాళికలతో ముందుకెళ్లాలి. అయితే.. విరాట్‌ కోహ్లీ (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) నేతృత్వంలో గత కొంత కాలంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ నిరాశపరిచింది. టీమ్‌ఇండియాలో కీలకంగా మారిన ఈ స్టార్‌ ఆటగాళ్లపై క్రికెట్‌ దిగ్గజం, భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్‌ దేవ్‌ (Kapil Dev) స్పందించాడు. 2023లో ప్రపంచకప్‌ గెలవడం కోసం వీరిపైనే ఎక్కువగా ఆధారపడటం సరికాదన్నాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.వరుసగా రెండోరోజూ లాభాలు.. 18,200 ఎగువకు నిఫ్టీ!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 136.09 పాయింట్లు లాభపడి 61,303.88 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38.80 పాయింట్ల లాభంతో 18,236.30 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.87గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌ షేర్లు లాభపడగా.. హిందాల్కో, ఎమ్‌అండ్‌ఎమ్‌, బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తదితర షేర్లు నష్టాల బాట పట్టాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. బ్రిటిష్‌ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా?: నాదెండ్ల

రాజకీయా పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతో బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైకాపా ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని