Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2023 15:58 IST

1. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందే: బొప్పరాజు

సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు అహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమండ్‌ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. అదే జరిగితే మాపై యుద్ధం ప్రకటించినట్లే: ఉత్తర కొరియా

ఉత్తరకొరియా(North Korea) మరోసారి అమెరికా(USA)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చిచెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది. అమెరికా-దక్షిణ కొరియా(South Korea) సంయుక్త యుద్ధవిన్యాసాలను ప్యాంగ్యాంగ్‌ తప్పుబట్టింది. ఈ మేరకు ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్‌ యో జోంగ్‌  ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు కేసీఎన్‌ఏ వార్తా సంస్థ వెల్లడించింది. ప్యాంగ్యాంగ్‌ వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తామని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అదానీ గ్రూప్‌ మరో రూ.7,374 కోట్ల రుణాల చెల్లింపు

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. నమోదిత కంపెనీల షేర్లు పతనం కావడంతో రూ.లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొన్ని రుణాలను ముందస్తుగానే చెల్లిస్తోంది. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన మరో రూ.7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించినట్లు మంగళవారం ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సీఎంగా నెఫ్యూ రియో రికార్డ్‌.. 

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ (Nagaland) ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ (NDPP) నేత నెఫ్యూ రియో (Neiphiu Rio) వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ లా గణేశన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)తో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. రియోతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీ..

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి.. వారం రోజుల కస్టడీకి కోరారు. దీనికి కోర్టు అనుమతించింది. విచారణకు పిళ్లై సహకరించడం లేదని కోర్టుకు ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. పిళ్లైని ఈడీ, సీబీఐ ఇప్పటికే 39 సార్లు పిలిచాయని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎలాన్‌ మస్క్‌.. బాత్‌రూం వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు..!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను (Twitter) సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. సంస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి చర్యలు కొనసాగిస్తున్నారు. మస్క్‌ అనూహ్య నిర్ణయాలపై ఆసంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) హెడ్‌ ఆఫీస్‌కు వచ్చిన సమయంలో ఎప్పుడూ సెక్యూరిటీ నడుమే ఉంటారని.. బాస్‌ బాత్‌రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఫాలో అవుతారని సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి మీడియాకు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  ఒకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 3 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు

 ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తమ యూజర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ (Airtel Recharge Plans)లను అందిస్తోంది. అపరిమిత ప్లాన్‌లు, డేటా యాడ్‌-ఆన్‌లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు (OTT Subscriptions).. ఇలా వివిధ కాంబినేషన్లలో రీఛార్జ్‌ ఆప్షన్లను ఇస్తోంది. ఈ క్రమంలో సరిపడా రోజువారీ డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలు కావాలనుకునేవారికి రూ.999తో ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. భారత్ X ఆసీస్‌ నాలుగో టెస్టు.. అహ్మదాబాద్‌ పిచ్‌ తీరేంటో..?

భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా ((Team India) ఉండగా.. చివరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎలాంటి పిచ్‌ను తయారు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి మూడు టెస్టుల్లో స్పిన్‌ ట్రాక్‌ వాడేసిన విషయం తెలిసిందే. అయితే, రెండు టెస్టుల్లో గెలిచిన టీమ్‌ఇండియాకు మూడో మ్యాచ్‌లో మాత్రం చుక్కెదురైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం: కేటీఆర్‌

ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతారణం ఉందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌(Hyderabad)లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. సీఐఐ(CII) తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఈవీల వల్ల చైనాపై మరింత ఆధారపడాలి!: GTRI

దేశంలో విద్యుత్‌ వాహనాల (Electric vehicles) వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రభుత్వం సైతం రాయితీలు ఇస్తోంది. దీంతో విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు వాహనదారులు ముందుకొస్తున్నారు. అయితే, దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీని (EV Manufacturing) పెంచడం వల్ల చైనాపై భారత్‌ ఆధారపడడమూ పెరుగుతుందని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ (GTRI) తెలిపింది. ముడి సరకులు, మినరల్‌ ప్రాసెసింగ్‌, బ్యాటరీ ఉత్పత్తి కోసం ఆ దేశంపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఈవీల వల్ల ఉన్న మరికొన్ని లోటుపాట్లను సైతం తన నివేదికలో చర్చించింది. బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్‌ వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు