Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2023 15:00 IST

1.జూన్‌ 4న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

భారత్‌లోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4వ తేదీ నాటికి అవి కేరళ (Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కర్ణాటక సీఎంపై వీడని సస్పెన్స్‌.. ఖర్గే ఇంటికి రాహుల్‌

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్‌ (DK Shivakumar)ల్లో ఎవరికి పట్టం కట్టాలన్నదానిపై కాంగ్రెస్‌ (Congress) పార్టీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్‌ ఖర్గే (Mallikarjun Kharge) నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌తో పాటు కర్ణాటక నుంచి కొందరు కాంగ్రెస్‌ నూతన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎంపీ అవినాష్‌ లేఖపై సీబీఐ రిప్లై... 19న విచారణకు రావాలని నోటీసులు

విచారణకు నాలుగు రోజులు సమయం కోరిన ఎంపీ అవినాష్‌ రెడ్డి ( MP Avinash Reddy) లేఖపై సీబీఐ స్పందించింది. వాట్సాప్‌ ద్వారా మరోసారి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎంపీ అవినాష్‌.. హైదరాబాద్‌ నుంచి పులివెందుల వెళ్తుండగా మార్గమధ్యంలో సీబీఐ నోటీసులు పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నష్టాలతో ముగిసిన సూచీలు.. 62,000 దిగువకు సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 413.24 పాయింట్లు నష్టపోయి 61,932.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 168.40 పాయింట్ల నష్టంతో 43903.70 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.21గా నిలిచింది. బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, బజాజ్‌ ఫినాన్స్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, ఎమ్‌ అండ్‌ ఎమ్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఊయలే ఉరితాడై.. అంగన్వాడీలో బాలుడి మృతి

కాకినాడ జిల్లా కాజులూరులో విషాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకుని ఓ బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. సత్యబాబు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు మనోజ్‌ చంద్రశేఖర్‌ (11) 5వ తరగతి చదువుతున్నాడు. తన చెల్లిని తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. విధుల్లో ఉన్న సహాయకురాలు పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లారు. అదే సమయంలో చంద్రశేఖర్‌ తలుపులు తీసుకొని లోపలికి వెళ్లి తూకం ఉయ్యాల ఎక్కాడు. ఈ క్రమంలో ఉయ్యాల తాడు బాలుడి మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ విషయం తెలియగానే.. పెన్ను తీసుకుని పరిగెత్తాను : గావస్కర్‌

ఈ సీజన్‌ (IPL 2023)లో చెన్నై (Chennai Super Kings) తన సొంత మైదానం వేదికగా చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఇటీవల ఆడేసింది. దీంతో తమ జట్టుకు మద్దతు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు మరిచిపోలేని బహుమతులను అందించాడు ధోనీ. మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానంలో పరేడ్‌ నిర్వహించారు. ఇక కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ(MS Dhoni).. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెజాన్‌లో సెల్లర్‌ ఫీజు పెంపు.. ఆ ఉత్పత్తులు ఇక ప్రియం?

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కొన్ని కేటగిరీ వస్తువులకు సెల్లర్‌ ఫీజును (Seller fee) పెంచింది. దుస్తులు, బ్యూటీ, కిరాణా, ఔషధాలు వంటి వివిధ రకాల వస్తువులపై విధించే సెల్లర్‌ ఫీజును సవరించింది. మే 31 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ ఫీజు పెంచడం వల్ల ఆ భారాన్ని విక్రేతలు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారతీయ వంటకాలపై ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే?

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. లండన్‌లో ఉన్న ఓ భారత రెస్టరెంట్‌ తనకు ఇష్టమైన వాటిలో ఒకటని కింగ్‌ ఛార్లెస్‌ III ఓ సందర్భంలో తెలిపారు. అలాగే ప్రఖ్యాత గాయని లేడీ గాగా సైతం భారత రుచులంటే తనకు చాలా ఇష్టమని ఓసారి తన మనసులో మాటను బయటపెట్టారు. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  (Elon Musk) కూడా చేరారు. ట్విటర్‌లో మస్క్‌ ఫాలోవర్‌ ఒకరు భారతీయ వంటలను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మూడు నెలల్లో ఫిట్‌గా మారండి.. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణే!

పోలీసు బలగాల (Police Force)కు ఫిట్‌నెస్‌ (Fitness) ఎంతో కీలకం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోలీసు బలగాలను మరింత ఫిట్‌గా మార్చేందుకు అస్సాం (Assam) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలల్లోగా ఐపీఎస్‌లతోసహా పోలీసులందరూ (Assam Police) తమ శరీరాన్ని ఫిట్‌గా మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు వారి బీఎంఐ (BMI)ని లెక్కగట్టనుంది. బరువు తగ్గనివారికి.. మరో మూడు నెలలు అవకాశమిచ్చి, అప్పటికీ ఫలితం లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అస్సాం డీజీపీ (Assam DGP) జీపీ సింగ్‌ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాస్కుల దెబ్బకు.. నవ్వడమే మరచిపోయారట..!

కరోనా మహమ్మారి (Covid Pandemic) సృష్టించిన విలయం నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు అమలు చేసిన ఆంక్షలు.. అక్కడి ప్రజలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు మాస్కులు (Mask) ధరించడంతో కొంతమంది జపాన్‌ వాసులు  (Japan) నవ్వడమే మరచిపోయారట. దీంతో ఇటీవల మాస్కులపై ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ నవ్వడాన్ని (Smile) నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులకు హాజరవుతుండటం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని