Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jun 2024 17:04 IST

1. తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్‌ తీరు

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద డబుల్‌ లేన్‌ రోడ్డు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన ఆ మార్గంలో ఎవరినీ అనుమతించకుండా జగన్‌ భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ రహదారిగా మార్చేశారు. మరో వైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్‌ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పూర్తి కథనం

2. ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పూర్తి కథనం

3. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున.. మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. పూర్తి కథనం

4. ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్‌

ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పూర్తి కథనం

5. ఫేక్‌ పోస్ట్‌.. రూ.100కోట్లు పరువు నష్టం దావా వేసిన నటి

తనకు సంబంధించిన ఫేక్‌ వీడియో పోస్ట్‌ చేసినందుకు నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. పూర్తి కథనం

6. మైక్రోసాఫ్ట్‌ విజయం వెనుక భారత్‌.. కొనియాడిన బిల్‌గేట్స్‌

భారత్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రతీ సందర్భంలోనూ చెబుతుంటారు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates). తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ (Nikhil Kamath) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌ విజయం వెనక భారతీయుల కృషి ఉందని పేర్కొన్నారు. పూర్తి కథనం

7. లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్‌ వైపుగా బయలుదేరింది. పూర్తి కథనం

8. దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్‌ నేత ఆతిశీ

హీట్‌వేవ్ కారణంగా దిల్లీ ప్రజలు నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆప్‌(APP) నేత, దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) ఆవేదన వ్యక్తంచేశారు. హరియాణా(Haryana) రాష్ర్టం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని ఆమె కోరారు. ఇటీవల దేశ రాజధానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court)  ఆదేశించింది. పూర్తి కథనం

9. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పూర్తి కథనం

10. ‘డియర్‌ కామ్రేడ్‌’పై పోస్ట్‌ పెట్టిన విజయ్‌ దేవరకొండ.. స్పందించిన రష్మిక

‘డియర్‌ కామ్రేడ్‌’పై హిందీ ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు చెప్పారు విజయ్ దేవరకొండ. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక నటించిన ఈ చిత్రం 2019లో విడుదల కాగా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని