Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 14 Mar 2023 08:59 IST

1. Cyclone Freddy: మలావిలో ‘ఫ్రెడ్డీ’ బీభత్సం.. 100 మందికిపైగా మృతి

ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను అతలాకుతలం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. నాటు అదిరింది.. నగరం ఊగింది!

నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాట రాసిన చంద్రబోస్‌ చదివిన రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పూర్వ విద్యార్థులు,  ఆయనతో కలిసి చదవడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఈ కళాశాలలో చంద్రబోస్‌ ఎలక్ట్రికల్‌ విభాగంలో 1986-1989 బ్యాచ్‌ విద్యార్థి. ఆ రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకలాపాల్లో పాల్గొంటూ పాటలు పాడేవాడు.  సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సినిమా పాటలు వినసొంపుగా ఆలపించే వాడు’ అని స్నేహితులు వివరించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. దోచుకునేందుకు అడ్డదారులు

హైదరాబాద్‌కు దీటుగా సకల హంగులతో దూసుకుపోతున్న ఖమ్మం నగరంలో.. నేర స్వభావం గల కొందరు యువకులు పేట్రేగిపోతున్నారు. నగరం చుట్టూ నిర్మానుష్య ప్రాంతాల వైపు వెళ్తున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే భయం ముంగిట నిల్చున్నామా అనే భావన ప్రస్ఫుటమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. శృంగార మామిడి!

మామిడిపండ్లను చూస్తే నోరూరనిది ఎవరికి? పండ్లలో మహారాజుగా పేరొందిన వీటి రుచే వేరు. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మరి వీటిని సరైన పద్ధతిలో తింటున్నారా? పండును తినటంలో సరైన పద్ధతేంటని అనుకుంటున్నారా? మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ తలెత్తొచ్చు. దురద పుట్టొచ్చు. అందువల్ల మామిడికాయలనైనా, పండ్లనైనా శుభ్రంగా కడగటం ముఖ్యం. తొడిమ వద్ద అంటుకొనే సొన పూర్తిగా పోయేలా చూసుకోవాలి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Virat Kohli: అలా నిరూపించాల్సిన స్థితిలో లేను: విరాట్‌

బయటకు వెళ్లి ఒకరిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో లేనని టీమ్‌ఇండియా అగ్రశ్రేణి బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసిన అతను.. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ‘‘ఓ ఆటగాడిగా నాపై నాకున్న అంచనాలే నాకెంతో ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్లి ఒకరిని తప్పని నిరూపించాల్సిన స్థితిలో లేనని కోహ్లి తెలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. కబళిస్తున్న ముప్పు.. యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌

జ్వరం.. దగ్గు.. జలుబు.. తదితర చిన్న చిన్న అనారోగ్యాలకు వాడుతున్న యాంటీ బయోటిక్‌ మందులు సరిగా పని చేయడం లేదు. రెండు, మూడు దశాబ్దాలుగా విపరీతంగా వినియోగించడం, కొవిడ్‌ సమయంలో అధిక సామర్థ్యం కలిగిన మందుల వాడకమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిని ‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’ అంటారు. ఈ కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల మంది చనిపోతున్నారంటూ ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ లాన్సెట్‌ గతేడాది ఓ కథనాన్ని ప్రచురించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.  పాత జలుబు కొత్తగా..

ఇదిగో జలుబు అంటే అదిగో కరోనా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఏ కొత్త వైరస్‌ విజృంభించినా మహమ్మారిలా మారుతుందేమోననే వణికిపోతున్నాం. కొవిడ్‌ అంతలా భయపెట్టింది! అందుకేనేమో మామూలుదైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌కూ ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాం. నిజానికి అంత ఆందోళన అవసరం లేదు. కొవిడ్‌లా ఇదేమీ కొత్తది కాదు. ఏటా వచ్చే సీజనల్‌ ఫ్లూనే. అలాగని అసలే ప్రమాదం లేదనుకోలేం. కొందరికి తీవ్రంగానూ పరిణమించొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8.Higher pension: ..వారికీ వెసులుబాటు.. మే 3 వరకు అధిక పింఛనుకు గడువు

ఉద్యోగుల పింఛను పథకం 1995 (ఈపీఎస్‌ 95) కింద అర్హులై.. 2014 సెప్టెంబరు కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈపీఎఫ్‌వో మే 3 వరకూ పొడిగించింది. అంతకు ముందు ఈ గడువు మార్చి 3తో ముగిసింది. ‘‘ఉద్యోగ, యాజమాన్య సంఘాల విజ్ఞప్తుల నేపథ్యంలో అధిక పింఛనుకు సంబంధించిన జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తుల సమర్పణకు మే 3, 2023 వరకు గడువు పొడిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని సోమవారం కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన అన్ని రకాల ఈపీఎఫ్‌వో చందాదారులకూ ఈ దరఖాస్తుల సమర్పణకు మే 3వ తేదీని తుది గడువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

9. అమ్మకి.. ఆరోగ్యంగా!

కడుపుతో ఉన్నప్పుడు సాధారణంగానే నీరసంగా అనిపిస్తుంటుంది. దీనికితోడు ఏవేవో రుచులు తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరమైనవైనా కొన్ని సహించవు. అలాగని అశ్రద్ధ వహిస్తే ఆమెకే కాదు.. కడుపులోని బిడ్డకీ పోషకాలు అందవు. మరెలా.. వీటిని ప్రయత్నించేయండి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. లీకైంది ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం

ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని