Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 28 Oct 2021 09:02 IST

1. నవంబరు 7 నుంచి పాపికొండల్లో బోటు యాత్ర

పాపికొండల్లో నవంబరు 7వ తేదీ నుంచి బోటు యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. నదిలో 28 మీటర్ల మట్టం వరకు జలాలు ఉన్నప్పుడు మాత్రమే పర్యాటక బోట్లను అనుమతిస్తున్నారని, దీన్ని 30 మీటర్ల వరకు పెంచాలని నీటిపారుదల శాఖను కోరతామన్నారు. బోటు నిర్వాహకులతో మంత్రి బుధవారం సచివాలయంలో సమావేశమై మాట్లాడారు.

2.మరో రూ.100 పెరగనున్న వంటగ్యాస్‌ ధర!

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100 మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయని.. ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మేరకు పెంపు ఉంటుందని సమాచారం.

3.ఏ సమయంలో కొవిడ్‌ పరీక్ష మంచిదంటే..

కొవిడ్‌ పరీక్ష రోజులో ఎప్పుడు చేయించుకున్నా ఫలితం ఒకేలా ఉంటుందా? ఇదేం సందేహం అనుకోకండి. రాత్రి వేళతో పోలిస్తే... మధ్యాహ్న సమయంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ద్వారా  రెండింతలు కచ్చితంగా ‘పాజిటివ్‌’ ఫలితం వెల్లడి అవుతుందని తాజా పరిశోధనలో తేలింది! వండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని రూఢి పరిచారు.

4.వివేకా హత్యలో ఆ నలుగురు

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. ఆ నలుగురి ప్రమేయంపై మంగళవారం పులివెందుల న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిలో ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ప్రస్తుతం జైలులో, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు.

5.కర్ణాటకలో డెల్టా ఏవై.4.2 కలకలం

బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనం కేసులను కర్ణాటకలో గుర్తించారు. పలువురి రక్త, ఇతర నమూనాలను రెండురోజుల కిందట పరీక్షలకు పంపగా.. బుధవారం ఆ వివరాలు వెల్లడయ్యాయి. ఏకకాలంలో ఏడుగురికి ఈ వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ కేసుల్లో రెండింటికి ఏవై.4.2 లక్షణాలున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ రణదీప్‌ వెల్లడించారు.

6.అప్పుల ఊబిలో ఉన్న పాక్​కు సౌదీ భారీ సాయం

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​కు సౌదీ అరేబియా భారీ సాయం అందించనుంది. 4.2 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ వారం సౌదీలో పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్​ సల్మాన్​తో చర్చలు జరిపిన మూడు రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

7.₹7.5 లక్షల బోనస్, విమాన టికెట్లు.. ఉద్యోగులకు లేడీ బాస్ సర్​ప్రైజ్​!

వ్యాపారం లాభాల బాట పడితేనో లేక ఏదైనా కీలక ఒప్పందం కుదిరితేనో ఉద్యోగులకు కంపెనీలు బోనస్​లు ఇస్తుంటాయి. ఉద్యోగుల నెల జీతం బట్టి కొంత మొత్తాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. కానీ, అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ (Sara Blakely) అనే మహిళా బాస్‌ మాత్రం తమ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లివచ్చేందుకు రెండు ఫస్ట్​క్లాస్​ విమాన టికెట్లు (Flight Tickets) ఇచ్చారు.

8.ఆర్యన్‌కు బెయిల్‌ కోసం తప్పని నిరీక్షణ.. వాదనలు నేటికి వాయిదా

మాదకద్రవ్యాల కేసులో బెయిల్‌ కోసం బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చెంట్‌, మూన్‌మూన్‌ ధమేచా దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వరుసగా రెండో రోజూ సుదీర్ఘ వాదనలు కొనసాగినా ఎవరికీ బెయిల్‌ రాలేదు. ఈ కేసులో వాదనలను గురువారం వింటామని వెల్లడించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

9.కిమ్స్‌ చేతికి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటాను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సొంతం చేసుకోనుంది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో 51.07 శాతం వాటా కొనుగోలు చేయటానికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల సన్‌షైన్‌ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏ.వి.గురవారెడ్డి, ఆయన సహచర వైద్య బృందం, కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యుల బృందంతో కలిసినట్లు అవుతుంది.

10.ఇది నయా పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టంటేనే అనిశ్చితికి మారు పేరు. కానీ టీ20 ప్రపంచకప్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన చూశాక.. ఇన్నాళ్లూ మనం చూసిన పాకిస్థాన్‌ ఇదేనా అనిపిస్తోంది. ఆ జట్టు పట్టుదలగా, ఇంత ఆత్మవిశ్వాసంతో ఆడి చాలా కాలం అయిపోయింది. ఉన్నట్లుండి వచ్చిన ఈ మార్పు చూసి క్రికెట్‌ ప్రపంచం విస్మయానికి గురవుతోంది. 90వ దశకంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ వైభవం గురించి అందరికీ తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని