Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 15 Nov 2021 09:08 IST

1.కుప్పంలో మున్సిపల్‌ పోలింగ్‌.. పర్యవేక్షణకు చంద్రబాబు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దొంగ ఓట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్రమాలపై ఆధారాలు సేకరించి వీడియోలు బయటపెట్టాలని సూచించారు.

ఏపీలో ‘పుర’ పోలింగ్‌ ప్రారంభం

2.చేనేత, జౌళికి కేంద్రం చేయూత ఏదీ!
చేనేత, జౌళి రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వడం లేదని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ వనరులు లేని రాష్ట్రాలకు అమలవుతున్నాయని అన్నారు. కొత్తగా ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుందని చెప్పారు.

3.నెరవేరని ప్రత్యేక హోదా హామీ
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని, మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని చెప్పడమంటే.. అప్పుడిచ్చిన హామీని ఉల్లంఘించడమే’ అని విమర్శించారు. 

4.ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలి
ప్రతి ధాన్యం గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలన్నారు. ధనిక రాష్ట్రం రైతుల కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

5.కోటి ఆశలతో.. కొలువుల పోటీకి

ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ప్రకటనలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. దాదాపు 70 వేల ఉద్యోగాలు భర్తీచేయబోతున్నట్టు స్వయంగా సీఎం ప్రకటించిన నేపథ్యంలో గ్రూప్‌-1, 2, 3పై యువత భారీగా ఆశలు పెట్టుకుంది. సర్కారు కొలువు సాధించాలనే కలను నెరవేర్చుకునేందుకు వేలమంది సిద్ధమవుతున్నారు.

6.కొవాగ్జిన్‌ టీకా వెనుక.. 20 కోతులు
నాడు లంకను చేరడానికి రాముడికి వానరసేన సాయం చేసింది. నేడు స్వదేశీ టీకా ‘కొవాగ్జిన్‌’ రూపకల్పనలోనూ భారత శాస్త్రవేత్తలకు ఆ వానరాలే అండగా నిలిచాయి. అవే లేకపోతే ఈ రోజు లక్షల ప్రాణాలు నిలిచేవి కావని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ అంటున్నారు. భారత్‌ స్వదేశీ వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ ప్రయాణంపై ఆయన ‘‘గోయింగ్‌ వైరల్‌.. మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ’’ అనే పుస్తకాన్ని రాశారు.

7.మాదకద్రవ్యాలను నియంత్రించండి
మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని, యువతను నిర్వీర్యం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

8.ఆస్ట్రేలియా అసలైన ఛాంపియన్‌
వన్డేల్లో ఆ జట్టు అయిదుసార్లు ఛాంపియన్‌. టెస్టుల్లోనూ చాలా ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. కానీ టీ20లకు వచ్చేసరికి ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రం. ఒక్కసారీ ప్రపంచకప్‌ గెలిచింది లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ రికార్డు ఏమంత గొప్పగా లేదు. అందులోనూ ఈసారి పొట్టి కప్పు ఆరంభానికి ముందు వరుసగా అయిదు టీ20 సిరీస్‌లో ఓడిపోయి.. తనపై ఎవరికీ అంచనాలు లేకుండా చేసిందా జట్టు.

కివీస్‌పై ఆస్ట్రేలియా ఎలా గెలిచిందో చూడండి!

9.భవిత సలసల!

విష్యత్తు కాలమంతా జనాన్ని వేడిమి అల్లాడించనుందా? మానవాళి  నిప్పుల కొలిమి వైపు పయనిస్తోందా? అవుననే అంటున్నాయి... ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు. సరాసరి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుండడం ఆందోళనకరమని ఐరాస నివేదిక  హెచ్చరిస్తోంది. దీనివల్ల విద్యుత్తు వినియోగం అధికమై... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయని, సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయి, పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని నివేదిక విశ్లేషించింది.

10.నీ కాళ్లపై నిలబడు.. ఇతరులు మోసేది పాడె

 ‘‘నీ కాళ్లపై నువ్వే నిలుచోవాలి.. ఇతరుల భుజాలపై మోసేది పాడె మాత్రమే’’.. ఇవీ అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి విపుల్‌ త్రిపాఠీ కుమారుడు, ఐదేళ్ల అబిర్‌ త్రిపాఠి జాతీయ జెండా ముందు నిలుచుని అత్యంత ధైర్యంగా పలికిన పలుకులు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలోనిదిగా భావిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని