Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 27 Nov 2021 09:12 IST

1.నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణంగా ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ తరవాత అది బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి.

2.ఆర్థికం అస్తవ్యస్తం

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది. శాసనసభ ఆమోదమే పొందకుండా అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. అసలు ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని హెచ్చరించింది.

3.63% పెరిగిన టమాటా ధర: కేంద్రం

టమాటా ధర ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.67 పలుకుతోందని, అది గత ఏడాది కంటే 63% అధికమని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ పేర్కొంది. ‘తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉత్తర భారత రాష్ట్రాలకు సరకు రావడంలో అడ్డంకులు ఏర్పడ్డాయని, అందువల్ల సెప్టెంబరు చివరి నుంచి క్రమంగా ధరలు పెరుగుతున్నాయి.

4..ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు

ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని పేర్కొంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో సమావేశమైంది.

5.బూస్టర్‌ తప్పనిసరి

ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్‌ డోసు (మూడోడోసు) వేసుకోవాలని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రెండుడోసులు ఇచ్చే ప్రక్రియను ఒకవైపు కొనసాగిస్తూనే.. బూస్టర్‌ డోసును ప్రారంభించాలని సూచించారు. అలా అయితేనే భారత్‌లో మూడోదశ ఉధ్ధృతిని నివారించవచ్చని తేల్చి చెప్పారు.

6.ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్‌’

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో... ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్‌ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది.

7.అంతర్జాతీయ విమానాలకు భారత్‌ పచ్చజెండా

అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ పచ్చజెండా ఊపింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్‌ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

8.పడగొట్టాలిక..

145 పరుగులకే 4 వికెట్లు పడ్డ స్థితి నుంచి.. గొప్పగా పుంజుకుని మరో వికెట్‌ పడకుండా తొలి రోజు ఆటను ముగించి తొలి టెస్టుపై పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన టీమ్‌ఇండియా.. రెండో రోజు తీవ్ర నిరాశకు గురి చేసింది. భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయి ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావడమే కాదు.. 57 ఓవర్ల ఆటలో ఒక్కటంటే ఒక్క వికెట్‌ పడగొట్టలేక ప్రత్యర్థిని గొప్పగా పుంజుకునే అవకాశం కల్పించింది.

9.కథ వినకుండానే ‘అఖండ’ చేశా

తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ చిత్రం   డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ  సందర్భంగా ప్రగ్యా జైస్వాల్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

10.ఆఫర్ల మొనగాడు

బిగ్‌ బిలియన్‌ సేల్స్‌లో భారీ ఆఫర్లు... బిగ్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ అప్పుడు రాయితీల వరద... ఇవెప్పుడోగానీ రావు! కానీ ‘ఏడాది పొడవునా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్లు ఇచ్చే సమాచారం మేం అందిస్తాం’ అంటున్నాడు చిత్తూరు జిల్లా పుత్తూరు కుర్రాడు కొడగంటి హరికిరణ్‌. తను టెక్‌గ్లేర్‌డీల్స్‌ డాట్‌కామ్‌ రూపకర్త.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని