Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 28 Nov 2021 08:57 IST

1.కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలన్న సీఎంవో ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. తదుపరి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనపెట్టారు.

2.ఒప్పందం ప్రకారమే బియ్యం తీసుకుంటాం

ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని స్పష్టంచేశారు.కేంద్రం కొత్త నిబంధనలేం తేలేదని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉప్పుడుబియ్యం ఇవ్వబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్‌ ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి మాటమార్చిందని ఆరోపించారు.

3.జగన్‌ రైతు వ్యతిరేక విధానాలపై లోక్‌సభలో పోరాడండి

దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెదేపా ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు.

4.కట్టడికి కదులుదాం

‘ఒమిక్రాన్‌’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.

కొత్తరకం గుట్టు తెలిసిందిలా..

5.ఐరాస మెచ్చిన మన పోచంపల్లి!

ఒకప్పుడు అది గాజుల పోచంపల్లి... తర్వాత ఇకత్‌ పట్టుచీరల ఊరు.. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దాతృత్వానికి దారి చూపి భూదాన్‌ పోచంపల్లి అయింది.. పడుగూపేకలే జీవితంగా గడిపే ఈ చేనేత కళాకారుల పల్లె తాజాగా ‘ఉత్తమ పర్యటక గ్రామం’గా ప్రపంచపటంపై నిలిచింది! ఐక్యరాజ్యసమితి అవార్డు గెలుచుకున్న పోచంపల్లి ప్రత్యేకతలను చూసేయండి.

6.మన ‘సిన్నతల్లి’.. 20 ఏళ్లుగా తల్లడిల్లి!

దొంగతనం అనుమానంతో అమాయకులను పోలీసులు  స్టేషన్‌కు తీసుకువెళ్లి క్రూరంగా హింసించడం.. దెబ్బలకు తట్టుకోలేక వారిలో ఒకరు చనిపోతే తప్పు కప్పిపుచ్చుకోడానికి కట్టుకథలల్లడం.. చివరకు న్యాయస్థానంలో దోషులుగా తేలడం.. ఇటీవల విడుదలైన ‘జైభీమ్‌’ సినిమాలో కథాంశమిది. ఎప్పుడో తమిళనాడులో జరిగిన యథార్థగాథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ‘సిన్నతల్లి’ పోరాటం ఫలించి లాకప్‌డెత్‌ బాధ్యులకు శిక్ష పడుతుంది.

7.ఫ్రెషర్స్‌ కోసం పెరిగిన పోటీ

పేరున్న విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రముఖ ఐటీ సంస్థలు వీరిని నియమించుకునేందుకు ముందు వరుసలో ఉండేవి. విద్యార్థులూ వీటికే ప్రాధాన్యం ఇస్తుండేవారు. ఇప్పుడు మధ్యస్థాయి ఐటీ సంస్థలూ ‘ఫ్రెషర్స్‌’ కోసం పోటీ పడుతున్నాయి. నియామకాల్లో తాజా ఉత్తీర్ణులకు ప్రాధాన్యమిస్తూ.. ఉద్యోగానికి అవసరమైన శిక్షణను తామే ఇస్తున్నాయి.

8.ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి!

ఐటీ కంపెనీలు ఒక్కసారిగా పంథా మార్చాయి. ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌(అంతర్గత శిక్షణ)ను తప్పనిసరి చేస్తున్నాయి. బీటెక్‌ 7వ సెమిస్టర్‌లో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు 3-4 నెలల శిక్షణకు తీసుకుంటున్నాయని, దీనివల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సాధారణంగా కొలువుకు ఎంపిక కాకముందే పరిశ్రమల్లో పనిచేసే అనుభవం కోసం కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లకు ఆహ్వానిస్తుంటాయి.

9.టాటా చిప్‌.. మనకు చిక్కేనా!

దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూపు దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న భారీ సెమీకండక్టర్ల (చిప్‌ల) పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మంది ఉపాధి పొందే వీలున్న పరిశ్రమ కావడంతో ఇది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే టాటా సంస్థ అయిదు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తుండడంతో పాటు ఇక్కడ అన్ని రకాల అనుకూలతలు ఉన్నందున మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ వైపే మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చని భావిస్తోంది.

10.విదేశాలకు విహార నౌకలు

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని