Updated : 29/11/2021 09:03 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1.తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు ఈ వేకువజామున 4గంటలకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి శ్రీవారి సేవలో డాలర్‌ శేషాద్రి తరిస్తున్నారు. 2007లోనే రిటైర్‌ అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తోంది.

2.కేంద్రానిది అసంబద్ధ, ద్వంద్వ వైఖరి...

తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.

3.నష్టం రూ.6,054 కోట్లు.. ఇచ్చేది 35 కోట్లా?

విపత్తు సమయంలో ముందస్తు హెచ్చరికలతో పాటు.. వరద అనంతర సహాయ చర్యలనూ ప్రభుత్వం విస్మరించిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘నవంబరు మొదటి వారానికే చెరువులన్నీ నిండి ఉన్నాయి. అయినా వర్షపాతం, అల్పపీడనంపై జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రత, ముందస్తు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదల స్వభావాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. న్యాయ విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

3.నేటి నుంచే సభా సమరం

పార్లమెంటు వేదికగా అధికార, విపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది! శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పెగాసస్‌, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తుండగా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టడమే లక్ష్యంగా పాలకపక్షం ప్రతివ్యూహాలు రచిస్తోంది.

4.ఓ కన్నేసి ఉంచుదాం

తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, ప్రాథమిక దశలోనే పసిగట్టగలిగితే ‘మత్తు’ వదిలించేందుకు ఆస్కారం   ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

5.అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్‌ కోచ్‌ రాంచీ

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఐదోరోజు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భారీ లక్ష్యాన్ని ఛేదిస్తామని న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ లూక్‌ రాంచీ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆట ముగిశాక మీడియాతో మాట్లాడిన అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సరైన ఆలోచనా దృక్పథంతో బ్యాటింగ్‌ చేస్తూ.. అవకాశాలను ఉపయోగించుకుంటూ పరుగులు సాధిస్తే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

6.తస్మాత్‌ జాగ్రత్త

కరోనా మూడో దశ ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ముప్పు తగ్గుతుందని, ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండు డోసులు పూర్తిచేసుకున్న ఆరు నెలలకు బూస్టర్‌డోసు అవసరమని, దీనిపై కేంద్ర మార్గదర్శకాలు వచ్చేవరకు ప్రజలు వేచి ఉండాలని కోరింది.

7.ఇక తాడో.. పేడో

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఆందోళన బాట పట్టాయి. డిసెంబరు 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోలు, తాలూకా, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు.. అనంతరం ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించాయి.

8.పడగొట్టేస్తారా?

కాన్పూర్‌ టెస్టుపై టీమ్‌ఇండియా మరింత పట్టుబిగించింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిలో మరో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో కుప్పకూలే స్థితి నుంచి తేరుకుని న్యూజిలాండ్‌కు కఠిన సవాలును విసిరిన భారత్‌.. త్వరగానే వికెట్ల వేటను మొదలెట్టింది. ప్రత్యర్థి ఛేదనలో నాలుగు పరుగులకే ఓ వికెట్‌ చేజిక్కించుకుంది. సాహా కూడా విలువైన అర్ధశతకం సాధించాడు.

కెప్టెన్‌పై వేటు తప్పదా?

9.మొగుడు కొట్టడం తప్పేం కాదు!

కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84%గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌)-5 ఈ మేరకు వివరాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు.

10.ఒమిక్రాన్‌.. ఏం చేస్తుందో!

కొవిడ్‌-19 వేరియంట్‌ (ఒమిక్రాన్‌)పై భయాలతో  సూచీలు బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ సంబంధిత పరిణామాలతో పాటు జులై-సెప్టెంబరు జీడీపీ గణాంకాలు, ఒపెక్‌ సమావేశ నిర్ణయాలు, అమెరికా పీఎంఐ వంటివి కీలకం కానున్నాయి. నిఫ్టీ 16,800- 17,500 పాయింట్ల శ్రేణిలో కదలాడొచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని