Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 21 Apr 2022 09:03 IST

1. ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే..

‘కార్డుదారులు ఇష్టం మేరకు నగదు కానీ, బియ్యం కానీ తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే ఇచ్చేందుకు వీలుగా అధ్యయనం చేస్తున్నాం’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగదు బదిలీని అమలు చేయాలని 2017లోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందన్నారు. ఇప్పటికే 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారని తెలిపారు.

2. సినిమా టికెట్‌ ధరల నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదు

సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. లైసెన్సింగ్‌ అథార్టీ (జేసీ)కి అభిప్రాయమే తెలియజేయగలదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అంతిమంగా ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్‌ అథార్టీయేనని స్పష్టం చేసింది. గత జీవోల ప్రకారం లైసెన్సింగ్‌ అథార్టీ టికెట్‌ ధరలను నిర్ణయిస్తుందని గుర్తుచేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని లోతుగా చూడాల్సి ఉందని అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీసు ఛార్జీలను టికెట్‌ ధరల్లో కలపడానికి వీల్లేదని స్పష్టం చేసింది.


Video: ఏడేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యం: కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్


3. ఆ విద్యుత్‌ అదానీదే

ఏపీ ప్రభుత్వం సెకి ద్వారా సౌర విద్యుత్‌ కొనేది అదానీ సంస్థ నుంచే. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుంచి 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ చెబుతోంది. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కి సెకి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న వివరాలతో అదానీ నుంచి విద్యుత్‌ తీసుకోడానికే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుందని స్పష్టమైంది.

4. శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు!

శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని సూచించింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫార్సు చేసింది.

5. కళ్లన్నీ మేరియుపోల్‌ పైనే..

కీలకమైన మేరియుపొల్‌ నగరాన్ని గుప్పిట పట్టేందుకు రష్యా ఒకపక్క గట్టి పట్టు బిగిస్తే.. మరోపక్క అక్కడి నుంచి పెద్దఎత్తున ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ఉక్రెయిన్‌ దృష్టి సారించింది. వృద్ధులు, మహిళలు, పిల్లల తరలింపునకు ప్రాథమికంగా అవగాహన కుదరడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వారిని జపోరిజిజియాకు పంపించనున్నారు. ఆ ప్రాంతం సురక్షితంగా ఉండడంతో పాటు అక్కడ ఆహారం, మందులు, తాగునీరు లభిస్తుందని మేరియుపొల్‌ మేయర్‌ తెలిపారు.


Video: వేసవిలో శరీరానికి మేలు చేసే షర్బత్‌లు..!


6. బుధవారం ఉదయం 9.27 నిమిషాలు.. భగ్గుమన్న భానుడి జ్వాలలు

భానుడు ఒక్క ఉదుటున భగ్గుమన్నాడు! బుధవారం ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ జ్వాలలు కురిపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్‌ వ్యవస్థలు దెబ్బతినే స్థాయిలో ఇవి నమోదైనట్టు కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా- (సెస్సీ)’ వెల్లడించింది. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్‌-12992 నుంచి ఎక్స్‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు వెలువడినట్టు వివరించింది. భారత్‌, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జ్వాలల ప్రభావం స్పష్టంగా కనిపించినట్టు సెస్సీ నిపుణులు గుర్తించారు.

7. ధ్యానం.. జీవన యానం

దైనందిన జీవితంలో ఇంటా బయటా ఎన్నో బంధాలూ, బాధ్యతలూ... మనుగడకి ఇవన్నీ అవసరమే. కానీ అవి ఒత్తిడి పెంచకూడదు. అలాగే నా ఉనికి.. నా శరీరం.. నా మనసు.. నాలో పొంగే జీవచైతన్యం- ఇలా ‘నేను’ గురించిన తపనతో, తాపత్రయంతో ఆందోళన చెందుతుంటాం. ఆవేదన, ఆక్రోశం కూడా కలుగుతుంటాయి. వాటికి  విరుగుడు ధ్యానమేనన్నారు నాటి  మహర్షుల దగ్గరి నుంచి నేటి మేధావుల వరకూ.

8. మరో స్వదేశీ జలాంతర్గామి

భారత నౌకాదళ జలాంతర్గాముల బలం మరింత పెరగనుంది. బుధవారం ఇక్కడి మజ్గావ్‌ డాక్‌ యార్డ్‌లో.. ప్రాజెక్టు-75లో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని ఏడాది పాటు పరీక్షిస్తారు. తర్వాత నౌకాదళంలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్‌-75లో భాగంగా ఆరు స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాములను భారత్‌ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా.. ఇప్పటికే కల్వరి, కందేరి, వేల, కరంజ్‌ జలాంతర్గాములు నౌకదళంలో సేవలందిస్తున్నాయి.


Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు


9. జై జవాన్‌.. రయ్‌ నాయక్‌

ట్రెండ్‌లో భాగమైనా కావొచ్చు... లేక  యాదృచ్చికంగానూ కావొచ్చు... మన కథానాయకులు అప్పుడప్పుడూ ఒకే రకమైన పాత్రల్లో దర్శనమిస్తుంటారు.   ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఇప్పుడూ కొన్ని పాత్రలు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్నాయి. పలువురు కథానాయకులు ఆర్మీ అధికారుల పాత్రల్లో కనిపిస్తుండటమే అందుకు కారణం.

10. మాజీ ఛాంపియన్లకు చావోరేవో

టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. ముంబయి  నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌. అయితే ఈ రెండు జట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సగం లీగ్‌ పూర్తవకముందే ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఒక్కదాంట్లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని