Top 10 News 9 PM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Published : 01 Jul 2024 20:59 IST

1. సీమాకు పింఛన్‌.... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

బంగారు తల్లి సీమా పర్వీన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్‌కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో గత వైకాపా సర్కార్ ఫించన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన చంద్రబాబును.. సీమా కుటుంబసభ్యులు కలిశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా ఫించన్ తొలగించడానికి మనసెలా వచ్చిందంటూ గత ప్రభుత్వాన్ని బాబు నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫించన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటా అంటూ బాధితురాలుతో సెల్ఫీ దిగి అప్పట్లోనే ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

భారాస ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3.  క్రెడిట్‌ కార్డే కాదు.. కరెంట్‌ బిల్లు చెల్లింపులూ ఆ యాప్స్‌లో కుదరవ్‌..!

ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పర్యటించారు. గొల్లప్రోలులో జనసేన వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాదు.. ఎన్డీయేకు అండగా నిలబడ్డ వ్యక్తిని. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటాం’’ అన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?

భారత టీ20 క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఇన్నాళ్లు భారత జట్టు తరఫున పరుగుల వరద పారించిన రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లను ఇక పొట్టి క్రికెట్‌లో చూడలేం. ఈ ఇద్దరూ యోధులకు 2024 టీ20 ప్రపంచ కప్‌ ఫైనలే చివరి మ్యాచ్‌. పొట్టి వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్‌, కోహ్లీ టీ20లకు గుడ్‌ బై చెప్పేశారు. మరో టీ20 ప్రపంచ కప్‌కు రెండేళ్ల సమయమే ఉంది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. నాలుగేళ్ల తర్వాత భారత్‌కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన క్వాంటాస్‌ (Qantas) విమానంలో చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. జియో, ఎయిర్‌టెల్‌ కొత్త టారిఫ్‌లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్‌’ చేస్తున్నారా?

టెలికాం కంపెనీలైన జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel) మొబైల్‌ ప్లాన్‌ ధరలను సవరించాయి. పెరిగిన ధరలు జులై 3 నుంచి అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి. కొత్త ధరలు అమల్లోకి రాకమునుపే వార్షిక ప్లాన్‌ రీఛార్జి చేసుకుంటే సుమారు రూ.600 మేర ఆదా చేసుకోవచ్చు. మూడు నెలలకు రీఛార్జి చేసినా రూ.130 మేర ఆదా అవుతుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. సిలబస్‌ ఇదే..

ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. రాహుల్‌ VS రాజ్‌నాథ్‌.. అగ్నిపథ్‌పై మాటల తూటాలు

లోక్‌సభ సమావేశాలు (Lok sabha Session) వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను (AgniPath) ‘యూజ్‌ అండ్‌ త్రో లేబర్‌’ పథకంగా రాహుల్‌ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్.. ప్రతిపక్షనేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. రకుల్‌ప్రీత్ మోటివేషన్‌.. నభా ప్రమోషన్‌.. రుహానీ శర్మ సెల్ఫీ!

తన కొత్త సినిమా ‘డార్లింగ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఫొటోలకు పోజిచ్చింది నభా నటేశ్‌. ట్రెండీ డ్రెస్సులో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రియదర్శి సరసన ఆమె నటించిన ‘డార్లింగ్‌’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. రుహానీశర్మ, శ్రద్ధాదాస్‌ తమ సెల్ఫీలు పోస్ట్‌ చేశారు.‘మండే మోటివేషన్‌’ అంటూ తన వ్యాయామానికి సంబంధించిన దృశ్యాలు పంచుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని