Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్‌ 10 వార్తలు: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Oct 2022 20:57 IST

1. నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక.. సన్నద్ధతపై సునీల్‌ బన్సల్‌ సమీక్ష

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై మరింత వేగం పెంచాలని కమలనాథులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక నవంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తెలిపారు. ఉప ఎన్నికకు ఇంకా 40 రోజులే ఉన్నందున ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఆయన మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ, పార్టీ  మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో శనివారం సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భాజపాకు బీ టీమ్‌గా వైకాపా.. ఏపీ మంత్రులపై గంగుల ఫైర్‌

తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతో మొదలైన ఈ ఎపిసోడ్‌ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెరాస ప్రభుత్వంపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. గహ్లోత్‌ నోట్సులో ‘ఎస్పీ’ ఎవరో..?

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన వేళ.. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్ ఆమెతో చర్చించేందుకు రాసుకొచ్చిన అంశాలు బయటకువచ్చాయి. అవి తాజాగా వైరల్ కావడంతో భాజపా ట్విటర్ వేదికగా తనదైనశైలిలో కామెంట్లు చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక, రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల గహ్లోత్‌.. సోనియాతో భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సిరీస్‌ కొట్టేయాలంటే... టీమ్‌ఇండియా వీటిపై ఓ లుక్కేయాలి!

దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌..  పొట్టి ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్‌ ఇదే కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌.. సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య గువహటి వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ఘోర పరాభవం పొందిన దక్షిణాఫ్రికా పుంజుకొనే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా దృష్టిసారించాల్సిన అంశాలేంటో..  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు

దేశంలో 5జీ శకం ఆరంభమైంది. ప్రధాని మోదీ చేతుల ఇవాళ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా 5జీ సేవల విస్తరణపై ఎయిర్‌టెల్‌, జియో తమ ప్రణాళికను వెల్లడించాయి. దీంతో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ అయిన BSNL 5జీ సర్వీసులు ఎప్పుడు తీసుకొస్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టతనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. పరిశుభ్ర నగరాల్లో ఇండోర్‌ ఆరోసారి.. టాప్‌-3 నుంచి విజయవాడ మిస్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా ఆరోసారీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూరత్‌, నవీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.  రాష్ట్రాల జాబితాలో  మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మహాత్ముడు మళ్లీ వచ్చే.. ఐరాసలో జాతిపిత ప్రసంగం

భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించారు. కన్పించడమే కాదు.. విద్యపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. అదేంటీ.. ఐరాసకు జాతిపిత రావడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌..!

దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెల్లుబాటు అయ్యే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ (పీయూసీ- పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) చూపించకుంటే పెట్రోల్‌ బంకుల్లో చమురు ‘పోసేదే లే’ అని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ స్పష్టంచేశారు. అక్టోబర్‌ 25 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. జోడో యాత్రలో ‘పేసీఎం’ వివాదం.. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ మండిపాటు!

కర్ణాటకలో కొనసాగుతోన్న కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’లో పేసీఎం టీషర్ట్‌ ధరించిన ఓ కార్యకర్తతో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. దీన్ని తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్‌.. పోలీసులు అతనితో బలవంతంగా టీషర్ట్‌ విప్పించి, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. వారికి ఈ అధికారం ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను శనివారం ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 142 ఏళ్ల జైలుశిక్ష

కేరళలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5లక్షల జరిమానా కూడా వేసింది. ఆ జరిమానా కట్టలేకపోతే అదనంగా మరో మూడేళ్లపాటు జైలు శిక్ష అమలయ్యేలా న్యాయస్థానం తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts