Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 07 Aug 2022 20:59 IST

1. కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు డిమాండ్‌ చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడమంటే చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి,  ఆన్‌లైన్లో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

2. కేసీఆర్‌.. తెలంగాణ డబ్బులు పంజాబ్‌లో పంచి పెడతారా?: బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భూదాన్‌ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ నుంచి ఐదో రోజు ప్రారంభమైన బండి సంజయ్‌ పాదయాత్ర చింతబావి, రేవణపల్లి, భూదాన్‌ పోచంపల్లి పట్టణం మీదుగా సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, మహిళలు, చిన్నారులను పలకరిస్తూ యాత్ర కొనసాగించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా పోచంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు.


Video: ఆలస్యమైన అభ్యర్థిని.. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చిన ఎస్సై


3. రైతులు, విద్యార్థుల కోసం ఎంతో చేశాం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. పంటలమార్పిడి, నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలన వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం జగన్‌ వివరించారు.

4. ఉత్తరాంధ్రకు వాయు‘గండం’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఇది వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ మీదుగా క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తారంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

5. నిఖత్‌ పసిడి పంచ్‌.. నాలుగో స్థానానికి భారత్‌

తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. అందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి.


Video: బడికి వెళ్లి అదృశ్యమైన బాలిక.. తొమ్మిదేళ్ల తరువాత ఇంటికి!


6. పెట్రో ధరల పెంపు నిలిపివేతతో రూ.18,480 కోట్ల నష్టం

అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా రేట్లను సవరించని కారణంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.18,480 కోట్ల నికర నష్టాల్ని మూటగట్టుకున్నాయి. సమీక్షా త్రైమాసికంలో ఐఓసీ రూ.1,995.3 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రూ.10,196.94 కోట్లు, బీపీసీఎల్‌ రూ.6,290.8 కోట్ల నష్టాలను నివేదించాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న బ్యారెల్‌ చమురు సగటు ధర రూ.109 డాలర్లుగా నమోదైంది.

7. SSLV ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు..

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (SSLV) ప్రయోగానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివారం జరిగిన ఈ ప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్ల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ (SSLV) నింగిలోకి దూసుకెళ్లింది.

8. తైవాన్‌పై గురిపెట్టిన డ్రాగన్‌.. రెచ్చిపోతున్న చైనా..

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆమె పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన డ్రాగన్‌ ఆదివారం కూడా వాయు, సముద్ర జలాల్లో మిలటరీ విన్యాసాలను కొనసాగించినట్టు వెల్లడించింది. ఓ వైపు ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా ప్రయత్నించాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తున్నప్పటికీ తైవాన్‌ జలసంధిని టార్గెట్‌ చేస్తూ డ్రాగన్‌ యుద్ధ విమానాలు, డిస్ట్రాయర్‌ నౌకలతో విన్యాసాలు చేస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.


Video: యుద్ధ విన్యాసాలను చైనా తక్షణం నిలిపివేయాలి: అమెరికా


9. సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం.. రాష్ట్రాలకు ప్రధాని కితాబు

కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడగలిగిందంటే అది రాష్ట్రాల సమిష్టి కృషేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కొవిడ్‌ను కట్టడిచేసేందుకు కృషిచేశాయని కొనియాడారు. నీతి ఆయోగ్‌  గవర్నింగ్‌ కౌన్సిల్‌లో ప్రధాని ప్రసంగించారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు సమర్థంగా చర్యలు తీసుకున్నాయన్నారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలకు భారత్‌ దిక్సూచిలా నిలిచిందని ప్రశంసించారు.

10. రెడీగా 28 ఐపీఓలు.. రూ.45 వేల కోట్ల సమీకరణ

స్టాక్‌ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ ఏప్రిల్-జులై మధ్య 28 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు అనుమతులిచ్చింది. ఈ ఐపీఓల ద్వారా దాదాపు రూ.45,000 కోట్ల సమీకరణ జరగనుంది. 2022-23లో ఇప్పటికే 11 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. రూ.33,000 కోట్లు సమీకరించాయి. దీంట్లో ఎల్‌ఐసీ సమీకరించిన రూ.20,557 కోట్లే సింహభాగం. సెబీ అనుమతి పొందిన వాటిలో లైఫ్‌స్టైల్‌ రిటైల్‌ బ్రాండ్‌ ఫ్యాబ్‌ఇండియా; భారత్ ఎఫ్‌ఐహెచ్‌; టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌; ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌; మెక్లాడ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ కిడ్స్‌ క్లినిక్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని