Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్‌ 10 న్యూస్‌: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Oct 2022 20:57 IST

1. బ్యాక్‌ వాటర్‌పై మరోసారి ఉమ్మడి సర్వే.. తెలంగాణ డిమాండ్‌కు అంగీకరించిన ఏపీ

పోలవరం బ్యాక్‌ వాటర్‌పై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పోలవరం బ్యాక్‌ వాటర్‌ పై కేంద్ర జల శక్తిశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాంకేతిక కమిటీ సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్‌ అధికారులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో వేళ‌లు రాత్రి 11గంట‌ల వ‌ర‌కు పొడిగింపు

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్‌ సేషన్ల నుంచి చివరి మెట్రో ఉండేది. దీన్ని మారుస్తూ.. ఈనెల 10 నుంచి టర్మినల్‌ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అభిషేక్‌ బోయిన్‌పల్లి పెట్టుబడులపై ఆరా

దిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరోసారి ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ కార్యాలయం, ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో అభిషేక్‌ బోయిన్‌పల్లి పెట్టుబడి పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రావణుడి తలలు దహనం కాలేదని ప్రభుత్వ ఉద్యోగిపై వేటు!

రావణ దహనంలో భాగంగా గడ్డి బొమ్మకు ఉన్న పది తలల్లో ఒక్కటి కూడా మంటల్లో కాలిపోకుండా అలాగే మిగిలిపోయిన ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరి నగరపాలికలో ఈ ఘటన చోటుచేసుకుంది. దసరా (Dussehra) ఉత్సవాల్లో భాగంగా డీఎంసీ ఆధ్వర్యంలో స్థానికంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. శివసేన గుర్తు అడిగే హక్కు శిందేకు లేదు: ఉద్ధవ్‌

శివసేన పార్టీ గుర్తుపై వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ‘విల్లు-బాణం’ గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్‌ ఠాక్రే, ఇటు సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గీయులు పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. తాజాగా గుర్తు కేటాయింపుపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఉద్ధవ్‌ను ఎన్నికల సంఘం కోరింది. శనివారంలోగా తన స్పందన తెలియజేయాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గౌతమ్‌ గంభీర్‌కు ప్రమోషన్.. ఇక గ్లోబల్ మెంటార్‌గా బాధ్యతలు!

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌కు కొత్త బాధ్యతలను అప్పగిస్తూ భారత టీ20 లీగ్‌ ఫ్రాంచైజీ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ క్రికెటింగ్‌ ఆపరేషన్స్‌కు గ్లోబల్‌ మెంటార్‌గా నియమించింది. ప్రస్తుతం గంభీర్‌ లఖ్‌నవూ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గ్లోబల్ మెంటార్‌గా నియమించడంతో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోనూ డర్బన్ సూపర్‌ జెయింట్స్‌కు మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కర్ణాటకలో ఓలా, ఉబర్‌, ర్యాపిడోకు షాక్‌.. ఆటో సర్వీసులు బంద్‌!

యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్‌, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే మూడు రోజుల్లో ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. బైడెన్‌ కుమారుడి పన్ను నేరాలపై ఆధారాలు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ పన్ను నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని ఫెడరల్ ఏజెంట్లు పేర్కొన్నారు. హంటర్‌, ఆయన మొదటి భార్యను విచారించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని వారు భావిస్తున్నారు. అయితే ఆయనపై కేసు పెట్టాలా..? వద్దా..? అనేది ప్రాసిక్యూటర్ నిర్ణయిస్తారని వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. జమ్మూకశ్మీర్‌లో ‘అగ్నిపథ్‌’ ర్యాలీ.. భారీగా తరలివచ్చిన యువత

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం కింద చేపట్టిన సైనిక నియామక ర్యాలీకి జమ్మూలో విశేష స్పందన లభిస్తోంది. అగ్నివీరుల నియామకం కోసం చేపట్టిన ర్యాలీకి తొలిరోజే వందలాది మంది యువత తరలివచ్చారు. జమ్మూలోని జోరవార్‌ స్టేడియంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ర్యాలీలో తొలిరోజు సాంబ జిల్లా నుంచి అత్యధికంగా ఔత్సాహిక యువకులు పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. బుమ్రా లేడని నిరాశ వద్దు.. మరో ఆటగాడికి అద్భుత అవకాశం: రవి శాస్త్రి

గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అవకాశం దక్కించుకొనే ఆటగాడు ఎవరా..? అనేది చర్చనీయాంశం. కొందరేమో మహమ్మద్‌ షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని చెబుతుండగా.. దీపక్ చాహర్ అయితే మంచి ఆప్షన్‌ అవుతాడని మరికొందరు పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉన్నారు. కానీ, ఆసీస్‌ పిచ్‌లపై సిరాజ్‌ అద్భుతంగా పేస్‌ రాబడతాడని వాదించేవారూ లేకపోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని