Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Jun 2023 21:26 IST

1. ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్‌ : కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రూ.4,116 పింఛను చెల్లిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాలలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసుల నుంచి జగన్‌ బయటపడేందుకే పూజలు, యాగాలు..: చంద్రబాబు

అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, తెదేపా అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. తెదేపా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రశ్నప్రతాల లీకేజీ కేసు.. సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటి?: హైకోర్టు

ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper leak case)ను సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరణ

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు ఏప్రిల్‌ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘మీ కుర్చీ.. నా భర్త ఇచ్చిన గిఫ్ట్‌’: పంజాబ్ సీఎంకు సిద్ధూ భార్య కౌంటర్‌

పంజాబ్‌ (Punjab) కాంగ్రెస్‌ (Congress) నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) భార్య నవజ్యోత్‌ కౌర్‌ (Navjot Kaur) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)కు తన భర్త సీఎం కుర్చీని ‘గిఫ్ట్‌’గా ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పగ్గాలు సిద్ధూ చేపట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరుకున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గూగుల్‌ ‘రిటర్న్‌ టు ఆఫీస్‌’ తీరుపై ఉద్యోగుల వ్యతిరేకత!

వారానికి కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని అంతర్గతంగా పంపిన మెయిల్‌లో పేర్కొంది. అయితే, ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం (Work From Home)’ విధానంపై కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఉబర్‌.. ర్యాపిడో’పై మీరేమంటారు? కేంద్రాన్ని అభిప్రాయమడిగిన సుప్రీం!

దేశ రాజధానిలో ఉబర్‌ (uber).. ర్యాపిడో (rapido) వంటి బైక్ ట్యాక్సీల నిషేధం వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కూడా అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పిటిషన్లను సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు అందజేస్తున్నట్లు కోర్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహిళా రెజ్లర్‌తో.. బ్రిజ్‌భూషణ్‌ ఆఫీస్‌ వద్ద సీన్‌ రీక్రియేషన్‌..!

భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh) తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన కార్యాలయానికి ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ రీక్రియేట్‌ (recreation) చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ కథనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ ఎవరో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం వరుడు ప్రతీక్‌(Pratik Doshi)తో అత్యంత నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో బెంగళూరు(Bengaluru)లోని మంత్రి ఇంట్లోనే బుధవారం ఈ పెళ్లి వేడుకను పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు

నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. వివరాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. ‘‘ఈ కేసులో నిందితుడు వెంకట సాయికృష్ణ, మరో మహిళతో కలిసి వచ్చి అప్సర కనిపించడం లేదని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని