Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 12 Mar 2023 21:01 IST

1. పార్టీ బలోపేతంకోసం చైతన్య కార్యక్రమాలు.. నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం

భారాసను క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ 60లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని భారాస అధినాయకత్వం ప్రణాళిక రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాపు నాయకులు సమాజానికి పెద్దన్నపాత్ర వహించాలి: పవన్‌ కల్యాణ్‌

కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం.. పోలీసులకు కీలక సమాచారం

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఓ పక్క అనుమానితుల్ని విచారిస్తూనే మరో వైపు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల  సహకారంతో బేగంబజార్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. తెలియని వ్యక్తులు సర్వర్‌లోకి వెళ్లి లాగిన్‌ అయినట్టు పోలీసులకు అధికారులు తెలపడంతో ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరనున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒకవేళ నాలుగో టెస్టు డ్రా... మరి ‘డబ్ల్యూటీసీ’ ఫైనల్‌కు వెళ్తామా?

ఇప్పుడంతా ఒకటే చర్చ.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలుస్తుందా.? లేదా..? ఎందుకంటే ఇక్కడ సిరీస్‌ విజయం కంటే అతి ముఖ్యమైన మరొక ఈవెంట్‌కు వెళ్లేందుకు బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ఫలితం కీలకంగా మారింది.ఆ ఈవెంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా చివరి టెస్టు జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో అధికారం తథ్యం: అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర భాజపా నేతలతో భేటీ అయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమై రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశ రాజకీయలపైనా సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై బండి సంజయ్‌.. అమిత్‌ షాకు ఒక నోట్‌ అందించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్వలింగ వివాహాలు.. దయచేసి ఆ పిటిషన్లను కొట్టివేయండి: కేంద్రం

స్వలింగ వివాహాలను అధికారికంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన వాదనలు వినిపించింది. ఈ రకమైన వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని సుప్రీం కోర్టుకు  తెలిపింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం, లైంగిక సంబంధాలు కలిగి ఉండటం నేరం కాకపోయినప్పటికీ, భార్యాభర్తల సంబంధానికి, భారతీయ సంస్కృతికి ఇది విరుద్ధమని కేంద్రం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముగిసిన నాలుగో రోజు.. మెరిసిన విరాట్.. పట్టు సాధించే దిశగా భారత్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ ఆధిక్యం సాధించింది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186)తో భారీ శతకంతో టీమ్‌ఇండియా (IND vs AUS) తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ టెస్టుల్లో సెంచరీ చేయడం విశేషం.  ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎస్‌వీబీ పతనం భారత స్టార్టప్‌లకు పెద్ద దెబ్బే.. నిపుణుల అంచనా!

ప్రధానంగా అంకుర సంస్థల (startups)కు నిధులు సమకూర్చే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం (SVB Crisis) భారత స్టార్టప్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క రాత్రిలోనే దేశ అంకుర పరిశ్రమ (startups)లో తీవ్ర అస్థిరతను నింపిందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఆశు గార్గ్ తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వెంకయ్యను మరికొన్నాళ్లు కేంద్ర మంత్రిగా కొనసాగించాల్సింది : రజనీకాంత్‌

మాజీ ఉపరాష్ట్రపతి, తన స్నేహితుడు వెంకయ్యనాయుడు(Venkaiah Naidu)ను ఉద్దేశిస్తూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2017లో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని అన్నారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో వెంకయ్యనాయుడితో కలిసి పాల్గొన్న ఆయన ఈ మేరకు తన మనసులోని మాటలు బయటపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని