Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 13 Aug 2022 21:16 IST

1. ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్‌ రాయిచుర

సినీనటుడు సంజయ్‌ రాయిచుర భాజపాలో చేరారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ సమక్షంలో ఆయన భాజపా కండువా కప్పుకున్నారు. నరేంద్ర మోదీ విజన్‌, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితమై భాజపా తీర్థం పుచ్చుకున్నట్టు సంజయ్‌ తెలిపారు. రాయిచుర చేరిక పార్టీని మరింత బలోపేతం చేసిందని ఈటల రాజేందర్‌ అన్నారు.

2. బతుకమ్మ కానుకగా కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌: మంత్రి హరీశ్‌రావు

బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.30లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందించినట్టు వెల్లడించారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 5 క్యాత్‌ ల్యాబ్స్‌, 5 ఎమ్‌ఆర్‌ఐ, 30 సీటీస్కాన్‌లతో పాటు 1,020 అధునాతన పరికరాలు ఉన్నాయని వెల్లడించారు.


Video: వరద ఉద్ధృతితో ఉప్పొంగుతున్న కృష్ణమ్మ


3. ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్‌

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని సినీనటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న సందర్భంగా జీవిత కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

4. ఉచిత పథకాలన్నీ రద్దు చేసి వచ్చే ఎన్నికలకు వెళ్తారా?: మోదీని ప్రశ్నించిన కేటీఆర్‌

ప్రజా సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ విధానమేమిటో దేశ ప్రజలకు స్పష్టం చేసి చర్చ పెట్టాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారో లేదో ప్రధాని చెప్పాలన్నారు. పేదలకు, రైతులకు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలపై భాజపా వైఖరి స్పష్టం చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి వచ్చే ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు.

5. మరో ఐదేళ్లు గోపాల్‌ విఠలే బాస్‌.. ఏడాదికి కోట్లలో వేతనం!

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గోపాల్‌ విఠల్‌ (Gopal Vittal) కొనసాగనున్నారు. మరో ఐదేళ్ల పాటు ఆయనే ఎండీగా ఉండేందుకు వాటాదారులు  ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. 97 శాతానికి పైగా వాటాదారులు ఆయనే ఎండీగా, సీఈఓగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో నిర్ణయం తీసుకున్నారు.


Video: గోడ పత్రికలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


6. విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?

విరాట్ కోహ్లీ.. ఈ పేరు గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ మూడేళ్ల కాలంలో ఒక్క శతకమూ బాదలేదు. అడపాదడపా అర్ధశతకాలను సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ఆట మాత్రం ఆడటం లేదనే వాదన బలంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్, ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్, కివీస్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ నిలకడగా ఆడుతుండటంతో విరాట్ ఫామ్‌పై చర్చ కొనసాగుతోంది.

7. విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో(Airports) పక్షులు, ఇతర వన్యప్రాణులు విమానాలను ఢీకొంటున్న ఘటన(Bird Hits)లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. వాటిని నివారించేందుకుగానూ డీజీసీఏ(DGCA) శనివారం ఎయిర్‌పోర్ట్‌ల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.  పెట్రోలింగ్‌(Random patrols), అసాధారణ రీతిలో వన్యప్రాణుల కదలికలు ఉంటే.. పైలట్‌లకు సమాచారం అందించడం వంటివి ఇందులో ఉన్నాయి.

8. ‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్‌

ఉచితాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తిన రోజే.. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఎంతమాత్రం ‘ఉచితాలు’ కావని వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకే ఈ పథకాలని పేర్కొన్నారు. ఇంతకుమించి మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు.


Video: ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. భారత్‌లో ఎక్కడంటే..!


9. ఆయన పత్రాలు సరైనవే.. వాంఖడేకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన సీఎస్‌సీ

గత ఏడాది డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని వార్తల్లో నిలిచారు సమీర్‌ వాంఖడే. ఆ సమయంలో ఆయన ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత కేసు విషయంలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. కాగా, ఆయనకిప్పుడు కుల ధ్రువీకరణ ప్రతాల విషయంలో ఊరట లభించింది. కొన్నినెలల పాటు నడిచిన వివాదంలో కాస్ట్‌ స్క్రుటినీ కమిటీ(సీఎస్‌సీ) క్లీన్‌ చిట్ ఇచ్చింది.

10. ఏంటీ సెక్యూరిటీ.. నేను అడిగానా..? అని గతంలో రష్దీ అనేవారు...

దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తన చుట్టూ ఉండే రక్షణ చూసి అసహనంగా ఉండేవారు. 2001లో ఒకసారి బహిరంగంగానే దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.  ‘ఇక్కడ నా చుట్టూ భారీస్థాయిలో ఉన్న రక్షణ వలయాన్ని చూసి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఇది అనవసరమని నా అభిప్రాయం’ అని అన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts