Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 17 Mar 2023 21:13 IST

1. IND vs AUS: లక్ష్యం స్వల్పమే.. కేఎల్‌ పోరాటం అపూర్వం..

మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా  ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ.. కేఎల్ రాహుల్ (75*) అర్దశతకం సాధించి భారత్‌ను గెలిపించాడు. రాహుల్‌కు తోడుగా రవీంద్ర జడేజా (45*) కీలక పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఆరోవికెట్‌కు ఏకంగా శతక (108) భాగస్వామ్యం జోడించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. KTR: బండి సంజయ్‌ రాజకీయ అజ్ఞాని.. యువతను రెచ్చగొడుతున్నారు: మంత్రి కేటీఆర్‌

టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విమర్శలను భారాస వర్కింగ్‌  ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తిప్పికొట్టారు. బండి సంజయ్‌ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని నాయకుడు సంజయ్‌ అని మండిపడ్డారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఒక ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IAF: ఎయిర్‌ఫోర్స్‌లో ‘అగ్నివీర్‌వాయు’ ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ

భారత వాయుసేన (Indian Air force)లో అగ్నివీరులుగా (Agniveer) చేరాలనే ఆసక్తి కలిగినవారికి గుడ్‌న్యూస్‌. అగ్నిపథ్‌ (Agnipath) పథకంలో భాగంగా అగ్నివీర్‌వాయు (Agniveervayu) నియామకాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు.. మార్చి 17 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Himanta Biswa Sarma: అన్ని మదర్సాలూ మూసేస్తాం.. అస్సాం సీఎం వ్యాఖ్యలు

అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ (madrasas) పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘నవ భారతం’లో మదర్సాలు అవసరం లేదన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. సిట్‌ నివేదికలో కీలక అంశాలు

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్‌ అధికారులు టీఎస్‌పీఎస్సీకి అందజేశారు. సిట్‌ నివేదికలో అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ నివేదిక అధారంగానే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన నాలుగు పరీక్షలను రద్దు చేసింది. ‘‘పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారి ప్రవీణ్‌తో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ చేతులు కలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IND vs PAK: దాయాదితో పోరు.. ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపా: సచిన్‌

దాయాదుల మధ్య (IND vs PAK) పోరంటే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది మ్యాచ్‌లో తలపడే ఆటగాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం సహజం. క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin) కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నాడట. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  2003 వన్దే ప్రపంచకప్‌ సందర్భంగా భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌కు ముందు తనకు నిద్ర కూడా కరవైందని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Delhi Liquor scam: సిసోదియా కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం (Delhi Liquor scam)లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కస్టడీని దిల్లీ కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. కేసు దర్యాప్తులో ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆయన్ను దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున వారం రోజుల పాటు కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు. అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 5 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భారత్‌కే ఎక్కువ అవకాశాలు: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

జూన్ 7నుంచి 11వ తేదీ వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా అడుగుపెట్టిన పెట్టాయి. గత సీజన్‌ (2021) ఫైనల్‌లో కివీస్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిన విషయం తెలిసిందే. అందుకే, లండన్‌ వేదికగా జరిగే ఈసారి ఫైనల్‌లో కచ్చితంగా గెలవాలని భారత్‌ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈసారి ఫైనల్‌లో భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆసీస్‌ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. New Front: కాంగ్రెస్‌ లేకుండా కూటమి.. కొత్త ఫ్రంట్‌పై దీదీ, అఖిలేష్‌ చర్చలు!

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని భాజపాను (BJP) ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భాజపాతో పాటు కాంగ్రెస్‌కు కూడా సమదూరం పాటించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు నిర్ణయించాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) మర్యాదపూర్వకంగా భేటీ అయిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav).. కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. MLC Elections: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు: వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి

కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని