Published : 18 Aug 2022 21:03 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతి: హరీశ్‌రావు

ఇప్పటికే రూ.వేల కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుల పునఃనిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందంటూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు ఖండించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అద్భుతమంటూ కొనియాడినవారే రాజకీయాల కోసం బురద జల్లుతున్నారని ఆరోపించారు.  కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? అని ప్రశ్నించారు.

2. పార్టీలోనే ఉంటా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. కానీ, రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వచ్చింది. వెంటనే ఆ వార్తను ఖండించా. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదు’’ అని స్పష్టం చేశారు.

3. భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్‌ సిద్ధమా?: బండి సంజయ్‌

పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస గూండాగిరి చేస్తోందని, తెరాస చేయించే దాడులకు భాజపా భయపడదని బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఎర్రవాళ్లను, పచ్చవాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడేది లేదన్నారు. భాజపాతో బల ప్రదర్శనకు కేసీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. భాజపా హిందూ ధర్మం కోసం పనిచేస్తుందని, పేదల కోసం 
అవసరమైతే గూండాగిరి చేస్తామని హెచ్చరించారు.

4. 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు

ఓటీటీల్లో (OTT Movies) సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. గురువారం ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇక నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకూ అగ్రిమెంట్‌ పూర్తయిన వాటిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలన్నీ థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే, అంటే 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తాయి’’ అని తెలిపారు.

5. స్వల్ప లక్ష్యం.. ఓపెనర్లే ఊదేశారు

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 190 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌ (81*), శుభ్‌మన్‌ గిల్ (82*) హాఫ్ సెంచరీలతో జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చారు.

6. ‘ఏడాదిలో ఉద్యోగం మారతాం’.. పీడబ్ల్యూసీ సర్వేలో ఆసక్తికర విషయాలు!

భారత్‌లో వచ్చే 12 నెలల్లో దాదాపు 34 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చే యోచనలో ఉన్నారని ప్రముఖ ఆర్థిక సంస్థ పీడబ్ల్యూసీ సర్వేలో తేలింది. దీని వెనుక కారణాలను తెలియజేస్తూ సర్వే ఫలితాలను పీడబ్ల్యూసీ ‘‘ఇండియా వర్క్‌ఫోర్స్‌ హోప్స్‌ అండ్‌ ఫియర్స్‌ సర్వే 2022’’ పేరిట విడుదల చేసింది. కంపెనీల్లో ఎటువంటి పనివాతావరణం ఉండాలని ఉద్యోగులు ఆశిస్తున్నారో కూడా ఈ సర్వే ప్రస్తావించింది.

7. జైలులో ఖైదీ హత్య కేసు.. 15మందికి ఉరిశిక్ష

ఝార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఓ ఖైదీ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 15మందికి మరణదండన విధించింది. జెంషెడ్‌పూర్‌లోని ఘఘిద్‌ సెంట్రల్‌ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ ఖైదీ హత్యకు గురయ్యాడు. గురువారం ఈ కేసు విచారించిన ఝార్ఖండ్‌లోని ఈస్ట్‌ సింగ్భుమ్‌లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి-4 రాజేంద్ర కుమార్‌ సిన్హా ఈ సంచలన తీర్పు ఇచ్చారు.

8. దేశంలో 35% కాలుష్యం పెట్రోల్‌, డీజిల్‌ వల్లే..!

క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతితో పాటు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడక తప్పదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో నమోదవుతున్న కాలుష్యంలో 35శాతం కేవలం డీజిల్‌, పెట్రోల్‌ వాడకం వల్లేనని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని, దిగుమతులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో తొలిసారి డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రికల్‌ బస్‌ను ముంబయిలో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

9. ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలు.. దేశంలోనే మొదటిసారి!

ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవల్లో సాధారణంగా ప్రైవేటు యాజమాన్యాలదే ఆధిపత్యం! ఈ క్రమంలోనే వాటికి పోటీ ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. ‘కేరళ సవారీ’ పేరిట దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సేవలను ప్రారంభించారు. కేరళ సవారీ సేవలతో ప్రయాణికులు, డ్రైవర్లు.. ఇద్దరికి మేలు చేకూరుతుందని పేర్కొంటూ, ‘కేరళ మోడల్’ మళ్లీ మెరిసిందని వ్యాఖ్యానించారు.

10. వాట్సాప్‌లో మెసేజ్‌ డిలీట్ చేశారా..? ఒక్క క్లిక్‌తో రికవరీ!

యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.  ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున లేదా తొందరపాటువల్ల ఏదైనా మెసేజ్‌ లేదా మీడియాఫైల్‌ను డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని