Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 22 Mar 2023 21:10 IST

1. 23న ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీర్‌ గురువారం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ఖమ్మం జిల్లా బోనకల్లులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వరంగల్‌ జిల్లాలో పరిశీలన తర్వాత కరీంనగర్‌ జిల్లా చేరుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉగాది వేళ.. కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగం చూశారా!

ఉగాది పండుగ వేళ భాజపా, భారాస మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. పరస్పరం రాజకీయ విమర్శలతో సాగిన వీరిద్దరి పంచాంగం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవిత ఈడీ విచారణ, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్న సమయంలో.. తాజాగా ఉగాది పంచాంగం రాజకీయవేడిని మరింత పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని మాంచి జోష్ మీదున్న తెలుగుదేశం పార్టీ.. ఎమ్మెల్యే కోటాలో అవకాశమున్న ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుస్తుందని తెదేపా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిందితుల కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి సిట్‌ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకొని వారందరికీ నోటీసులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వికెట్ల మధ్య ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఎవరు..? వరస్ట్‌ రన్నర్‌ ఎవరు..? కోహ్లీ సమాధానాలివే..

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధానత్యనిస్తాడో తెలిసిందే. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే ఈ ఆటగాడు.. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా సులువుగా మార్చుతాడు. ఇలా వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎందరో దిగ్గజ బ్యాటర్లతో కోహ్లీ పిచ్‌ షేర్‌ చేసుకున్నాడు. వారిలో మాజీ కెప్టెన్‌ ధోనీ ఒకరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అదానీ సంపదలో వారానికి రూ.3,000 కోట్లు ఆవిరి!

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద ఈ ఏడాది భారీగా కుంగినట్లు ‘ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌’ నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన సగటున వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయినట్లు పేర్కొంది. ఫలితంగా ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. రష్యాకు చెందిన ఝోంగ్‌ శాన్‌శాన్‌ ఆ స్థానానికి చేరారు. ప్రస్తుతం అదానీ సంపద 53 బిలియన్‌ డాలర్లుగా హురున్‌ నివేదిక లెక్కగట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బిల్కిస్‌ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే

2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌బానో(Bilkis Bano) వేసిన పిటిషన్‌ విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court) అంగీకరించింది. అత్యాచార ఘటన కేసులో దోషులు కొద్దినెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేయడంపై ఆమె సుప్రీంను ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ

కొన్నేళ్ల క్రితం వరకు టెలికాం వినియోగదారుడిగా ఉన్న భారత్‌.. ఆ సాంకేతికతను (Telecom Technology) భారీగా ఎగుమతి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దిల్లీలోని ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనిట్‌ (ITU) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. 5జీ సాంకేతికతను అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకొస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!

మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం(Earthquake) దక్షిణాసియా దేశాల్లో భయాందోళనలను సృష్టించింది. కొన్ని సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఉత్తర భారత్‌లో పలు భవనాలు దెబ్బతిన్నాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు. కానీ కశ్మీర్‌(Kashmir)లోని ఓ ఆసుపత్రిలో అదే సమయంలో వైద్యులు సి-సెక్షన్(C-Section) నిర్వహిస్తున్నారు. దాంతో ఆపరేషన్ రూమ్‌లోనూ ఆ కదలికలు కనిపించాయి. అయినా వైద్యులు తమపని కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.  భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టమైంది. బారీకేడ్ల సంఖ్య పెరిగడంతో పాటు భద్రతాధికారుల సంఖ్య పెరిగింది. సెంట్రల్‌ లండన్‌లోని ఇండియా ప్లేస్‌గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఈ భవనం వద్ద వారంతా విధుల్లో కనిపించారు. దిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్‌ హైకమిషన్‌ (UK High commission) కార్యాలయం బయట బారికేడ్లను తొలగించిన మరుక్షణమే యూకే ప్రభుత్వం నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు