Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Nov 2022 21:01 IST

1. మల్లారెడ్డి సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనం.. ఐటీశాఖ గుర్తించిన అక్రమాలివే!

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయ పన్నుశాఖ సోదాల్లో దాదాపు రూ.15కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీ ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. రెండున్నర రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు?: శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో న్యాయవాది శ్రీనివాస్‌ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అతనికి నోటీసులు జారీ చేసింది. నందకుమార్‌, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్‌ వద్ద శ్రీనివాస్‌ రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపిన సిట్‌ అధికారులు.. ఆ అప్పుకు సంబంధించి నెలకు రూ.1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్రంపై సమరానికి తెరాస సిద్ధం.. డిసెంబరులో శాసనసభ సమావేశాలు?

రాష్ట్రంలో రాజకీయ అలజడి కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గ్రూప్‌-2, 3, 4లో మరికొన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం

గ్రూప్‌-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్‌-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్‌-3లో మరో రెండు, గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్‌-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌,  అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.33వేల కోట్లు విద్యా రంగానికే!: మోదీ

గుజరాత్‌ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన పార్టీ భాజపా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని దేఘం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో శాస్త్రీయ విధానంలో, ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన సాగుతోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జిమ్‌లో విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్‌

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,కేఎల్‌ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. అనంతరం డిసెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ జట్టుతో 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనతో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లో అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన

వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమైన ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. మరో ప్రకటన చేసింది. తన ఆన్‌లైన్ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం దీనిని ప్రారంభించగా.. ఎటువంటి కారణం వెల్లడించకుండానే మూసివేత గురించి ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెరిస్తే రంగు.. బట్టతలైతే పూర్తి గుండు: సిబ్బందికి ఎయిరిండియా కొత్త రూల్స్‌!

టాటా యాజమాన్యంలో ఎయిరిండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. ముఖ్యంగా విమానాల్లో పనిచేసే క్యాబిన్‌ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. జుట్టు నెరిసిన వారు రంగు వేసుకోవాలని, అమ్మాయిలైతే మేకప్‌ కచ్చితంగా వేసుకోవాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భార్యకు హెచ్‌ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!

భార్యకు ప్రాణాంతక వ్యాధి ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. విడాకుల(Divorce)కు యత్నించిన ఓ వ్యక్తి పిటిషన్‌ను బాంబే హైకోర్టు(Bombay High Court) కొట్టిపారేసింది. ఆమెకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధరించే ఎటువంటి సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంటూ.. అతని అభ్యర్థనను తిరస్కరించింది. పుణెకు చెందిన దంపతులకు 2003లో వివాహమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్యలు!

గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గుజరాత్ హైకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువని వ్యాఖ్యానించింది. తీవ్రంగా గాయపడిన వారికి కూడా అతి తక్కువ పరిహారాన్ని ప్రకటించడాన్ని తప్పుబట్టింది. మోర్బీ ఘటన కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు