Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 Mar 2023 21:11 IST

1. తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్‌

ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్దఅంబర్‌పేటలో నిర్వహించిన ‘భారాస ప్రగతి నివేదన సభ’లో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణం: బండి సంజయ్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి  సీఎం కేసీఆర్‌ మాట్లాడటం లేదని.. సీఎం కుమారుడు (కేటీఆర్‌) మాత్రమే స్పందిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద భాజపా చేపట్టిన ‘మా నౌకరీలు మాగ్గావాలే’ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడివారైనా ప్లాట్లు కొనుక్కోవచ్చు.. సీఆర్‌డీఏ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. మంగళగిరిలోని నవులూరు వద్ద మధ్యాదాయ వర్గాల కోసం వేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్‌లో ప్లాట్ల కొనుగోలు కోసం మరోమారు ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. లేఅవుట్‌ వేసి రెండేళ్లు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్‌

ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన... పలుచోట్ల ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) సూరత్‌ కోర్టు రెండేళ్ల జైటు శిక్ష విధించడం, ఆపై ఆయనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ శ్రేణులు (Congress) భగ్గుమన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు శనివారం నిరసనలు ప్రదర్శనలకు దిగారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల శాంతియుతంగా ఈ నిరసనలు జరగ్గా.. మరికొన్ని చోట్ల కాస్త ఉద్రిక్తతకు దారితీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్‌ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్‌

ప్రధాని మోదీ (Modi) ఇంటిపేరును కించపర్చారన్న అభియోగాలపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష పడటం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం (Disqualification) రద్దవడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్న వేళ.. భాజపా (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా(Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం(Center) అప్రమత్తమవుతోంది. మరోవైపు ఇన్‌ఫ్లుయెంజా(influenza) వ్యాప్తి కలవరపెడుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అత్యవసరపరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్‌ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్ నిర్వహించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అప్పుడు ధోనీ రోటీ, బటర్‌చికెన్‌ తింటున్నాడు..కానీ మ్యాచ్‌లో ఏమైందంటే: సురేశ్‌రైనా

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni)ని మొట్టమొదట కలిసినప్పుడు జరిగిన సరదా సంఘటన గురించి క్రికెటర్‌ సురేశ్‌ రైనా(Suresh Raina) గుర్తు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా, సీఎస్‌కే జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు వారిద్దరూ క్రికెట్ ప్రత్యర్థులు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైనా సెంట్రల్‌ జోన్‌ నుంచి ఝార్ఖండ్‌కు చెందిన ధోనీ ఈస్ట్ జోన్‌ నుంచి 2005లో దులీప్‌ ట్రోఫీలో తలపడ్డారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనను రైనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టోర్నడోల విధ్వంసం.. 23 మంది మృతి..!

అమెరికా(America)లో సుడిగాలు(Tornado)లు విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి మిసిసిపీ(Mississippi) రాష్ట్రంలో బలమైన గాలులతోపాటు ఓ టోర్నడో ధాటికి దాదాపు 23 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. సుడిగాలుల బీభత్సానికి మిసిసిపీ, అలబామా(Alabama), టెన్నసీ(Tennessee)ల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మహిళల బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో నీతూకు స్వర్ణం

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను స్వర్ణం వరించింది. 48 కేజీల విభాగంలో బాక్సర్‌ నీతూ గంగాస్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో మంగోలియా బాక్సర్‌ లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీ, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతు.. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ తాజాగా తన సత్తా చాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని