Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 25 Sep 2022 21:47 IST

1. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: రేవంత్‌

గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన బలరాం నాయక్‌కు కేంద్ర మంత్రిగా, శంకర్‌ నాయక్‌కు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ అవకాశమిచ్చిందన్నారు. ఇది గిరిజనులకు కాంగ్రెస్‌ ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు, చిత్తశుద్ధికి నిదర్శనమిదే: వినోద్‌ కుమార్‌

గడచిన ఐదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తూ ఐదేళ్లలో రూ.1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించిన విషయాన్ని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రాజకీయాల ప్రస్తావన.. అలా చెప్పటం మంచిదే: చిరంజీవి

‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని ప్రముఖ నటుడు చిరంజీవి సోషల్‌ మీడియాలో ఇటీవల పంచుకున్న ఆడియో ఫైల్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాను నటించిన సినిమాలోని డైలాగ్‌ను పెట్టారా? రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ టీవీ, పత్రికలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌.. ఇలా అన్నింటిలోనూ ఆ సంభాషణ హాట్‌టాపిక్‌గా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఆ పార్టీలన్నీ బయటకు వచ్చాక.. ఇంకా ఎన్డీఏ కూటమి ఎక్కడిది..?

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి లేదని ఆర్జేడీ నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. అందులో నుంచి జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, శివసేన పార్టీలు బయటకు వచ్చాక ఇంకా ఎన్డీఏ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఆ పార్టీలు ఎన్డీయే కూటమిని వీడాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బీసీసీఐలో మోగిన ఎన్నికల నగారా.. గంగూలీ బరిలోకి దిగేనా..?

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)లో ఎన్నికల సీజన్‌ వచ్చేసింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవుల ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదలైంది.  ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నోటిఫికేషన్‌ను పంపింది. బీసీసీఐ నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేందుకు దరఖాస్తు దాఖలుకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు గడువునిచ్చింది. అక్టోబర్‌ 5వ తేదీన డ్రాఫ్ట్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌ను ప్రకటిస్తారు. అభ్యంతరాలను అక్టోబరు 6-7 తేదీల్లో సమర్పించాలి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


6. తుది దశలో భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు

భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని లండన్‌ లార్డ్‌ మేయర్‌ విన్సెంట్‌ కీవెని తెలిపారు. ఇంకా కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉన్నప్పటికీ దీపావళి నాటికి ముసాయిదా సిద్ధమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతవారం ముంబయిలో జరిగిన ఫిన్‌టెక్‌ సదస్సులో పాల్గొన్న ఆయన తిరిగి యూకే చేరుకున్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఐడియా అదుర్స్‌.. ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన ‘మ్యారేజ్‌ హాలు’.. ప్రత్యేకత ఇదే!

సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రశంసించి మరింతగా ప్రోత్సహించడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. క్రియేటివ్‌ అంశాలతో పాటు స్ఫూర్తిదాయకమైన కథనాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అందరితో పంచుకొనే ఈ పారిశ్రామిక దిగ్గజం.. తాజాగా ఓ ‘మొబైల్‌ మ్యారేజ్ హాలు’ వీడియోను షేర్‌ చేశారు. షిప్పింగ్‌ కంటైనర్‌ని ఓ అద్భుతమైన కల్యాణ వేదికగా మలచిన ఆలోచనకు ముగ్దుడైన ఆయన.. దీన్ని డిజైన్‌ చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. సోనియాతో లాలూ, నీతీశ్‌ల భేటీ.. ఏం చర్చించారంటే..!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ-యూ నేత నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం దిల్లీలోని సోనియా నివాసానికి చేరుకున్న ఇరువురు నేతలు.. విపక్షాల ఐక్యతపై చర్చించారు. ఐతే, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత వీటిపై మరోసారి చర్చిద్దామని ఇద్దరు నేతలకు సోనియా చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ధోనీ మార్కెటింగ్‌ గిమ్మిక్‌..!

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎం.ఎస్‌.ధోని ఎట్టకేలకు అభిమానుల ఉత్కంఠకు తెరదించారు. ఆదివారం కీలక ప్రకటన చేయనున్నానని శనివారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏం చెబుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. భారత టీ 20 లీగ్‌ నుంచి కూడా తప్పుకుని పూర్తిస్థాయి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ, వాటన్నింటికీ తెరదించుతూ.. అదంతా ఓ మార్కెటింగ్‌ గిమ్మిక్కుగా తేల్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. ‘ఇండియన్‌-2’ కోసం చెమటోడుస్తున్న కాజల్‌.. ఈసారి ఏకంగా మార్షల్‌ ఆర్ట్స్‌..!

మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తోన్న ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్.. తిరిగి వెండితెరపై తళుక్కున మెరిసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తల్లి కావడంతో శరీరాకృతిలో వచ్చిన మార్పుల వల్ల కాస్త బొద్దుగా మారిన ఈ భామ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్ట్టారు. ఇందులో భాగంగా ఇటీవల గుర్రపుస్వారీ నేర్చుకొన్న కాజల్‌ తాజాగా మార్షల్‌ ఆర్ట్స్‌పై దృష్టి పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని