Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Sep 2023 21:03 IST

1. KTR: నా పర్యటనలు తక్కువ అయ్యాయని తిట్టుకోవద్దు: మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లాలో ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. గంభీరావుపేటలోని ఎస్సీ కాలనీలో 104, బీసీ కాలనీలో 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Hyderabad: గణేశ్‌ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా!

నగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏకదంతుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం  ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Pawan Kalyan: ఆడబిడ్డలపై దురాగతాలు.. ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా?: పవన్‌

ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించకపోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యంపై మాట్లాడితే హాహాకారాలు చేసిన మహిళా కమిషన్ ఇప్పుడు ఏం చేస్తోందో చెప్పాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Siddaramaiah: ఇంకా వాళ్లు లౌకికవాదులేనా?భాజపాతో జేడీఎస్‌ పొత్తుపై సిద్ధరామయ్య

జేడీఎస్‌ ( JDS)కు ఇకపై తమది లౌకికవాద పార్టీ అని చెప్పే అర్హత లేదని కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. ప్రస్తుతం జేడీఎస్ పేరులో మాత్రమే సెక్యులర్‌ ఉందని, ఎన్నికల కోసమే ఆ పార్టీ భాజపాతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-జేడీఎస్ పొత్తుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి

సాధారణ ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(MK Stalin) కోరారు. కార్యాలయానికి వచ్చిన వారిని సీట్లో కూర్చోమని చెప్పి వారి మాటలు వినాలన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలకు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. బుధవారం చెన్నైలో గ్రూప్‌ 4 ఉద్యోగాలకు నియమితులైనవారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేసిన సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పడుతోంది. బుధవారం భారత షూటర్ల హవా నడిచింది. షూటర్లు ఒకే రోజు రెండు బంగారు పతకాలు సహా 7 పతకాలను సాధించారు. తద్వారా మొత్తం 22 పతకాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

7. Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Chandrababu: చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై సుప్రీంలో విచారణ వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Asian Games: ఆసియా క్రీడల్లో షూటింగ్‌ మెరుపులు.. రికార్డు స్థాయిలో పతకాలు

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు క్రమంగా పుంజుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజులోనే ఎనిమిది పతకాలను సాధించారు. ఇందులో షూటర్లే ఏడింటిని సొంతం చేసుకోవడం విశేషం. మరొకటి సెయిలింగ్‌లో వచ్చింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో టీమ్ఇండియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. PM Modi: ప్రధానికి ఛాయ్‌ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్‌ అవ్వొద్దన్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌’ 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ (Robotics Gallery)ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్‌ (Chai) ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని