Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 28 Jan 2023 21:07 IST

1. తారకరత్నకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది: చంద్రబాబు

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR) స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం విచారించింది. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా.. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాష్‌ రెడ్డిని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు

కృష్ణా జిల్లా నాగాయలంకలో వైకాపా శ్రేణుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్‌ పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరితో పాటు ఆయన అనచరులు వచ్చారు. ఈక్రమంలో ఎంపీ బాలశౌరి వర్గీయులపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వివాదం సద్దుమణగలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సమస్యలు తెలుసుకుంటూ.. బీసీలకు భరోసానిస్తూ: రెండో రోజు లోకేశ్‌ పాదయాత్ర

వివిధ వర్గాలను అక్కున చేర్చుకుంటూ.. విద్యార్థుల్లో జోష్‌ నింపుతూ.. పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. బీసీలకు భరోసానిస్తూ  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా సాగింది. కుప్పంలోని బీఈఎస్‌ వైద్యకళాశాల వద్ద నుంచి ప్రారంభమైన రెండో రోజు పాదయాత్ర పెగ్గిలిపల్లి, గణేష్‌పురం క్రాస్‌, కడపల్లి, కలమలదొడ్డిల మీదుగా శాంతిపురం వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల

ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura)లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. తాజాగా అధికార భాజపా (BJP).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌ను ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ బరిలోకి దింపింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మా మధ్య పోటీ మాత్రం మామూలుగా ఉండదు: స్టొయినిస్‌

ఫిబ్రవరిలో భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఆట తమకు అత్యంత ప్రమాదకరమని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ పేర్కొన్నాడు. అయితే తమ జట్టు బలంగా ఉందని, ఇరుజట్ల మధ్య పోటీ గొప్పగా ఉండబోతోందని తెలిపాడు. ఈ ఏడాది ట్రోఫీని కచ్చితంగా సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మేడం.. పన్నులను సరళీకరించండి..!

భారత్‌లో పన్నులను క్రమబద్ధీకరించడంతోపాటు.. సరళీకరించేలా సంస్కరణలను ప్రవేశపెట్టాలని యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ను కోరింది. వార్షిక బడ్జెట్‌కు తమ ఆకాంక్షలను కేంద్రానికి వెల్లడించింది. విదేశీ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును కమబద్ధీకరించాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘వెనుకబడిన వారికే ప్రాధాన్యత’ అనే నినాదంతోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. రాజస్థాన్‌లోని గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దేవుడిగా ఆరాధించే దేవనారాయణుడి 1111వ జయంతి ఉత్సవాలకు మోదీ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బిల్వాడా జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా జరుపుతోన్న దురాక్రమణపై ఉత్తర కొరియా(North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది రష్యా పక్షమేనని వెల్లడించారు. తాము రష్యా(Russia) సైన్యం, ప్రజల పక్షానే నిల్చుంటామని కిమ్(Kim) సోదరి కిమ్‌ యో జోంగ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని