Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 28 Sep 2022 21:13 IST

1. తీరు మార్చుకోకపోతే టికెట్‌ ఇచ్చేది లేదు.. 27మంది ఎమ్మెల్యేలపై జగన్‌ ఆగ్రహం

ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికను సీఎం వెల్లడించారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు సరైన పనితీరు కనబర్చలేదని సీఎం అసంతృప్తి వ్యక్తి చేసినట్టు సమాచారం. 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై  ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. నేను అందుకే పార్టీ అధ్యక్ష రేసులో దిగలేదు: కమల్‌నాథ్‌

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రమణదీక్షితులు వివాదాస్పద ట్వీట్‌పై తితిదే అర్చకుల కౌంటర్‌

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తితిదే అర్చకులు ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియదు. అర్చకులందరూ కలిసి స్వామివారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా, సంతృప్తికరంగానే ఉంది’’ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌ వాసులపై వరుణుడి ప్రతాపం.. వరుసగా మూడో రోజు భారీ వర్షం

భాగ్యనగర వాసులపై వరుణుడి ప్రతాపం వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోలు, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘గాడ్‌ ఫాదర్’ ట్రైలర్‌ వచ్చేసింది.. చిరు యాక్షన్‌ అదిరింది

ఎప్పుడెప్పుడా? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ‘గాడ్ ఫాదర్‌’ (God Father) ట్రైలర్‌ వచ్చేసింది. వారి అంచనాలకు తగ్గ కంటెంట్‌తో నెట్టింట సందడి చేస్తోంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్ ఫాదర్‌’. అక్టోబరు 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మనకి అన్ని ప్రభుత్వ బ్యాంకులక్కర్లేదు: SBI మాజీ చీఫ్‌

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ‘కొన్ని’ ప్రభుత్వరంగ బ్యాంకులుంటే సరిపోతుందని చెప్పారు. అవీ బలమైనవి అయ్యుండాలని పేర్కొన్నారు. చిన్న చిన్న బ్యాంకులను ప్రైవేటీకరించడమో, విలీనం చేయడమో చేయాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వాటిని బలోపేతం చేయడం ద్వారా కూడా చేరుకోవచ్చని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. 5జీ ప్లాన్ల కోసం 45 శాతం అధికంగా చెల్లించడానికైనా సిద్ధమట!

దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులు 2023 నాటికి 5జీ నెట్‌వర్క్‌కు మారేందుకు ఆసక్తిగా ఉన్నారని ఎరిక్సన్‌ నివేదిక బుధవారం వెల్లడించింది. అలాగే వీరిలో చాలా మంది 5జీ సేవల కోసం 45 శాతం అధిక ధరలు చెల్లించేండానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపింది. దీంతో టెలికాం కంపెనీలకు మంచి ఆదాయం రానుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ₹10వేల కోట్లతో 3 రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశంలో న్యూదిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వేస్టేషన్లను రూ.10వేల కోట్లతో కొత్త హంగులు అద్దేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ నియామకం

హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవిని కేంద్రం భర్తీ చేసింది. నూతన సీడీఎస్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ని నియమించింది. బిపిన్‌ రావత్‌ మరణం తర్వాత ఈ సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం తదుపరి సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అక్రమ పోలీస్‌ స్టేషన్లు..’!

ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా ఎదగాలని చూస్తోన్న చైనా.. ఇందుకోసం కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్‌తోపాటు అనేక దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్‌ పోస్టులను ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ.. సొంత దేశంపై వ్యతరేకంగా మాట్లాడే వారిని అణచివేసే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయనే చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని