Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 29 Sep 2022 21:01 IST

1. వచ్చి చూస్తే తెలుస్తుంది.. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై బొత్స కామెంట్‌

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘హరీశ్‌రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చు. ఒక్కసారి వారు వచ్చి చూస్తే టీచర్లకు మేం చేసినవి తెలుస్తుంది. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్‌సీలలో తేడా చూస్తే తెలుస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. బ్యాక్‌ వాటర్‌పై కీలక సమావేశం.. తెలంగాణ వాదనను తోసిపుచ్చిన కేంద్ర జల్‌శక్తిశాఖ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్రం నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలవరం బ్యాక్‌ వ్యాటర్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్రం వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘పైలట్‌కు మళ్లీ చెక్‌’..విమర్శలకు పదును పెట్టిన భాజపా

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు గహ్లోత్‌ ప్రకటించిన తరుణంలో అధికార భాజపా విమర్శలకు పదును పెట్టింది. గహ్లోత్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది. మరోవైపు సీఎం కుర్చీని ఆశించిన సచిన్‌పైలట్‌కు పార్టీ అధిష్ఠానం మళ్లీ ‘చెక్‌’ పెట్టిందని భాజపా ఐటీ సెల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘థరూర్‌ దిగ్విజయ్’‌.. మనది ఫ్రెండ్లీ ఫైట్‌

అనేక మలుపులు.. నాటకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై ఓ మేరకు స్పష్టత వచ్చింది. రాజస్థాన్‌ సంక్షోభ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బరిలోకి దిగారు. అటు ఎంపీ శశిథరూర్‌ పోటీ ఇప్పటికే ఖాయమైంది. దీంతో ప్రస్తుతానికి హస్తం పార్టీ అధినాయకత్వ పదవికి వీరిద్దరి మధ్యే పోటీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సూర్యకుమార్‌.. ఒక్క మ్యాచ్‌.. రెండు రికార్డులు

సఫారీలను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. దక్షిణాఫ్రికాపై తొలి టీ20లో అర్ధశతకం సాధించిన సూర్యకుమార్ (50*: 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (51*)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ పెంపు.. కొన్నింటిపైనే!

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో  (small savings schemes) మదుపుచేసే వారికి  కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొన్ని పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 30 బేసిస్‌ పాయింట్ల వరకు ఆయా పథకాలపై వడ్డీరేట్లను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్‌- డిసెంబర్‌) ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పేద ప్రజలున్న ధనిక దేశం మనది: గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశంగా నిలిచినప్పటికీ.. ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkarai) అన్నారు. వారంతా ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో గడ్కరీ భారత్‌ వికాస్‌ పరిషత్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పండగ ఆఫర్లు ఓ వైపు.. కొత్త ఫోన్ల లాంచ్‌ మరోవైపు..అక్టోబరు నెలంతా సందడే సందడి!

కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి అక్టోబరు నెలలో ఎన్నో ఆప్షన్లు. ఈ-కామర్స్‌ సంస్థల పండగ ఆఫర్లు ఓ వైపు.. ప్రత్యేక ఆఫర్ల పేరుతో మొబైల్ కంపెనీల ఆఫర్లు మరోవైపు. వీటికి తోడు మొబైల్ కంపెనీలు కొత్తగా విడుదల చేసే మోడల్స్‌ ఉండనే ఉన్నాయి. పండగ ఆఫర్ల గురించి ఇప్పటికే ఈ-కామర్స్‌, మొబైల్‌ కంపెనీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. మరి, అక్టోబరులో కొత్తగా విడుదయ్యే మోడల్స్‌ మాటేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. సైన్యంలో లైంగిక వేధింపులు నిజమే.. క్షమాపణ చెప్పిన జపాన్‌ ఆర్మీ

జపాన్‌ సైన్యంలో (Japan Army) అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సైన్యంలో మహిళలపై లైంగిక వేధింపులు (Sexual Harassment) జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది. ఇందుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపింది. ఓ మాజీ సైనికురాలికి తోటి సిబ్బంది నుంచి ఎదురైన వేధింపులపై జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు జపాన్‌ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. జడేజా స్థానంలో అక్షర్ అన్నారు‌.. మరి బుమ్రా బదులు ఎవరున్నారు?

గాయాలు మళ్లీ టీమ్‌ఇండియాను ఇబ్బందిలోకి నెడతాయా..? జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయా..? మరో 24 రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడబోతున్న వేళ.. గట్టి దెబ్బ తగలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమవుతాడనే వార్తలు టీమ్ఇండియా అభిమానుల్లో కలవరం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts