Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 20 Nov 2021 21:03 IST

1.రైతులపై పెట్టిన కేసులన్నీ కేంద్రం ఎత్తివేయాలి: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఉలుకూపలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం రాత్రి ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టంచేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం.. మాట్లాడతామని కేంద్రం చెప్పిందన్నారు.

2.ఏపీలో భారీ వర్షాలకు నష్టం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా ఏపీలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలో జరిగిన నష్టంపై ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. నాలుగు జిల్లాల్లో 172 మండలాలపై వర్షాల ప్రభావం పడిందని తెలిపింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించినట్టు వెల్లడించింది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 24 మంది మృతిచెందగా.. 17మంది గల్లంతైనట్టు ప్రకటించింది.

3.రాజకీయాల్లో విమర్శలు ఉండాలే తప్ప తిట్లు ఉండకూడదు!

రాజకీయాల్లో విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండకూడదని, సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని నాగబాబు ఖండించారు. ఇలాంటి చెత్త సంప్రదాయానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

4.ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా ఉద్యమంలో రైతులు వెనక్కు తగ్గలేదని ఆయన కొనియాడారు. ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమరులయ్యారని, మరణించిన రైతులకు నివాళులర్పిస్తూ, విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలపడానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం చేపట్టిందన్నారు.

5.కొవిన్‌ పోర్టల్‌లో కొత్త సదుపాయం.. ఇకపై వారూ వ్యాక్సిన్‌ స్టేటస్‌ తెలుసుకునే వీలు!

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లో మరో కొత్త సదుపాయాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వ్యక్తుల వ్యాక్సినేషన్‌ స్థితిని తెలుసుకునే సదుపాయాన్ని ఇతరులకూ కల్పించింది. వ్యక్తి ఫోన్‌ నంబర్‌, పేరు ఎంటర్‌ చేయడం ద్వారా వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా వ్యాక్సిన్‌ స్థితిని తెలుసుకునే వీలును కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.

6.హార్దిక్‌ టీ20 జట్టులోకి వస్తాడు.. అయితే: గౌతమ్‌ గంభీర్

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పైనా, తిరిగి జట్టులోకి చోటుపై చర్చ కొనసాగుతూనే ఉంది. వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్‌ ఐపీఎల్‌లోనూ, టీ20 ప్రపంచకప్‌లోనూ బౌలింగ్ చేయలేదు. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే సేవలందించాడు. అయితే బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించిందేమీ లేదు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేసిన సందర్భంగా చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడని పేర్కొన్నాడు.

7.దాతగా మారుతున్న చైనా.. ఎందువల్ల?

ఆర్థికంగా, సైనిక పరంగా అమెరికాను అధిగమించి సూపర్‌ పవర్‌గా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న చైనా.. ఆ దిశగా ఒక్కో లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లు కనిపిస్తోంది! ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన దేశంగా డ్రాగన్‌ అవతరించింది. మరోవైపు చైనా అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకునే క్రమంలో ‘ప్రపంచ బ్యాంకు’ వంటి అనేక అభివృద్ధి సంస్థల్లో తమ వాటాను పెంచుకుంటూ పోతోందని ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్(సీబీడీ)’ తాజా నివేదిక తెలిపింది‌.

8.ఇమ్రాన్‌ఖాన్‌ ‘పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై దుమారం

పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తనకు ‘పెద్దన్న’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దీనిపై భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

9.15-15-15 నియ‌మంతో రూ.2 కోట్లు సమకూర్చడం ఎలా?

ల‌క్ష్యం పెద్ద‌ద‌యిన‌ప్పుడు పెట్టుబ‌డుల విష‌యంలో బాధ్యతగా మెల‌గాల్సి ఉంటుంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. యువ‌త ఇప్పుడు పెట్టుబ‌డులపై  ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎందులో ఎలా పెట్టుబ‌డి పెట్టాలి అనే అంశాల‌పై స్ప‌ష్ట‌త లోపించ‌డంతో కొంత త‌డ‌బ‌డుతున్నారు. మంచి రాబ‌డి పొందాలంటే కొంత రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు.

10.రోహిత్‌-రాహుల్‌కు బ్యాకప్‌ ఆటగాడిని చూడాలి: డీకే

టీమ్‌ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరికైనా గాయాలైతే బ్యాకప్‌ ఆటగాడు ఉండాలని అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని