Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 27 Dec 2021 20:57 IST

1.తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన

తెలంగాణలో త్వరలోనే విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఛార్జీల పెంపుపై డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రాతిపదికన ప్రతిపాదనలు సమర్పించాయి.  గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. 

2.వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

ఒమిక్రాన్‌ కలకలంతో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ కీలక సమీక్ష ముగిసింది. వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలన్నారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

3.సింగరేణి కార్మికుల 50ఏళ్ల కల సాకారం కాబోతోంది: సీఎండీ

రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరే శుభ తరుణం ఆసన్నమైంది. సీఎం కేసీఆర్ గతంలో ప్రజలకు రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ రూ.500 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇవాళ కొత్తగూడెంలో జరిగిన చరిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డ్ తన అంగీకారం తెలిపింది.

4.రేవంత్‌పై జగ్గారెడ్డి ఫిర్యాదు..సోనియాకు లేఖ!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై  ఆ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలను పొందుపరుస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్‌ పంథాలో ముందుకు వెళ్లడంలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. వైఖరి మార్చుకోకపోతే రేవంత్‌ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చి.. కాంగ్రెస్‌ పంథాలో పనిచేసే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమించాలని కోరారు.

Dil Raju : ఇండస్ట్రీ అంతా ఒక్కటే: నిర్మాత దిల్‌ రాజు

5.జనవరిలోగా జాబ్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే..: బండి సంజయ్‌ హెచ్చరిక

తమ పార్టీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తమ పార్టీ దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్ష ముగిసింది.

6.కొవిడ్‌ సోకిన ఏడు నెలల వరకు శరీరంలోనే వైరస్‌!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌ ఒక్కసారి సోకితే అది నెలలపాటు ఒంట్లోనే ఉండి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేపట్టారు.

7.బూస్టర్‌ డోసుగా ఏ టీకాను ఇవ్వనున్నారు..?

దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న వేళ ఇదివరకే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు (ప్రికాషన్‌ డోసు) ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 10వ తేదీ నుంచి తొలుత వీటిని ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు తీసుకున్న డోసునే బూస్టర్ డోసుగా ఇస్తారా లేక ఇతర వ్యాక్సిన్‌ను ఇస్తారా అనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

8.సెహ్వాగ్‌ను అధిగమించిన రాహుల్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (122 బ్యాటింగ్) శతకంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీతో టెస్టుల్లో ఏడు సెంచరీలు పూర్తి చేసుకున్న రాహుల్‌.. మరో రికార్డు నమోదు చేశాడు. ఆసియా ఖండం వెలుపల అత్యధిక సెంచరీలు (5) నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (4 శతకాలు) రికార్డును అధిగమించాడు.

AP News: వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబే సీఎం: అచ్చెన్నాయుడు

9.బ్యాంక్‌ లాక‌ర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలి?

బంగారం, ఆస్తి ప‌త్రాలు వంటి విలువైన వ‌స్తువుల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు బ్యాంకు లాక‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు చాలామంది. లాక‌ర్ తీసుకున్న త‌ర్వాత దానికి సంబంధించిన ఒక 'కీ'ని ఖాతాదారునికి ఇస్తాయి బ్యాంకులు. ఒకవేళ ఆ లాక‌ర్ తాళాన్ని పోగొట్టుకుంటే ఏం చేయాలి? లాకర్‌లోని సామగ్రికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌క్ష‌ణ‌మే ఎలా స్పందించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

10.మరోసారి తెరపైకి ఎర్రజెండా పార్టీల విలీనం అంశం!

కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఈ అంశంపై  ఆసక్తికర చర్చ జరిగింది. ఈ మహాసభలకు ప్రత్యేక అహ్వానితులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కమ్యూనిస్టులు కలవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 2005లో నల్గొండలో జరిగిన మహాసభల్లో బీవీ రాఘవులు ఈ ప్రతిపాదన చేశారని... కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని