Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 10 Jan 2022 21:06 IST

1.హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షం పడే సూచన: వాతావరణ శాఖ

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్‌, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లోనూ పిడుడులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2.సంక్రాంతి రద్దీ.. రేపు సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు‌

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాత్రి 9గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న ఈ సువిధ ప్రత్యేక రైలు (నెం 82725) మరుసటిరోజు ఉదయం 9.50గంటలకు విశాఖ చేరుకోనుందని తెలిపింది. 

3.భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు వచ్చి విమర్శించడమా..: హరీశ్‌రావు

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని భారం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ఎదుట ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన రైతుబంధు పథకం వారోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Viral news: ఆస్పత్రిలోనే గుండెపోటు.. అయినా వైద్యం కరవు!

4.వాళ్లు కావాలంటే సినిమా వాయిదా వేసుకోవచ్చు: పేర్ని నాని

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని(Perni nani) స్పష్టం చేశారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే వాయిదా వేసుకోవచ్చని సూచించారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

5.317జీవోపై భాజపా ఎంపీలు అలా ఎందుకు చేయలేకపోతున్నారు?: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీలిక తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ కార్యాలయంలో రాత్రి నిద్ర చేస్తే తెరాసకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

Elections : యూపీ రాజకీయాల్లోకి మరో పురాణ పురుషుడు

6.థర్డ్‌వేవ్‌ వేళ.. ఆస్పత్రి చేరికలు పెరుగుతున్నాయ్‌..!

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇలా థర్డ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కొవిడ్‌ బాధితుల ఆస్పత్రి చేరికలు 5 నుంచి 10శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ విజృంభణ క్రియాశీలంగానే ఉన్నందున.. రానున్న రోజుల్లో ఆస్పత్రి చేరికలు వేగంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

7.జల్లికట్టుకు పచ్చజెండా.. నిబంధనలు తప్పనిసరి

స్థానికంగా ఏటా నిర్వహించే సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’కు తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. పోటీలో పాల్గొనేందుకు 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాలు వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నాయి.

8.కొత్తగా స్కోడా కొడియాక్‌.. 7.8 సెకన్లలో 100 కి.మీ వేగం!

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా కొడియాక్‌ ఎస్‌యూవీని మరోసారి భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బీఎస్‌-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్‌ను డిస్‌కంటిన్యూ చేసిన కంపెనీ.. తిరిగి కొత్త హంగులతో మరోసారి తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.34.99-37.49 లక్షలు (ఎక్స్‌షోరూం). ఇది 7.8 సెకన్లలో 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.

Crime news : లక్కీ లాటరీ పేరుతో జనాలకు కుచ్చుటోపీ

9.కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్‌ సోదరి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్‌ రాజకీయాల్లో చేరికలు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ ఉదయం మోగాలోని సోనూసూద్‌ నివాసానికి వెళ్లిన పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ.. వారితో కొంతసేపు ముచ్చటించారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక.. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

10.ఈవీ రంగంలో సినీ నటుడు వెంకటేశ్‌ పెట్టుబడులు

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం అందించే బైక్‌వో కంపెనీలో పెట్టుబడులతో సినీ నటుడు వెంకటేశ్‌ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టడంతో పాటు కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వెంకటేశ్‌ వ్యవహరించనున్నారని బైక్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20వేల ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పాలన్న తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు