Published : 24 Jan 2022 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.బుద్దా వెంకన్నఅరెస్టు.. పోలీసుల వైఖరి దుర్మార్గం : చంద్రబాబు

తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు. బుద్దాపై కేసు బనాయించడం కుట్రపూరితమని, అతడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కొడాలి క్యాసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2.ఆ మహిళల ఖాతాల్లోకి రేపు రూ.15 వేలు జమ !

అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. మంగళవారం వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని  3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్‌ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

3.తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు.. 3 మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 97,113 నమూనాలను పరీక్షించగా 3,980 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,38,795కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,01,047 మంది కరోనా నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. మరో 33,673 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.

4.పీఆర్సీ వ్యవహారం.. నలుగురు సభ్యులతో కమిటీ

ఏపీలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న ఆందోళనపై  రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల్లోని అనుమానాల నివృత్తికి కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Video: సమ్మెకు సై అన్న ఉద్యోగ సంఘాలు

5.భారత్‌లో వారంలోనే 150% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌ఓ

ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్‌ మూలకారణమని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గడిచిన వారంలో భారత్‌లో 15,94,160 కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారం 6,38,872 కేసులు మాత్రమే వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.

6.సెన్సెక్స్‌లో టాప్‌ 10 నష్టాలు ఇవే!... నేటి నష్టం స్థానమెంతంటే?

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజంతా నెత్తురు రంగు పులుముకున్నాయి. ట్రేడింగ్‌ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు సూచీలు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ ఏ దశలోనూ లాభాల ముఖం చూడలేదు. దీంతో మదుపర్లకు నష్టమే మిగిలింది. అలా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో భారీ నష్టాలు వచ్చిన టాప్‌ 10 రోజులేవంటే?

7.ప్రియాంక ఎఫెక్ట్‌.. భాజపాలో మహిళలకు ప్రాధాన్యం!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. తాజాగా మహిళా నేతలతో భాజపా నిర్వహించిన భారీ ర్యాలీనే ఇందుకు ఉదాహరణ అని.. దీన్నే ‘ప్రియాంక ఎఫెక్ట్‌’ అంటారని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు.

8.షార్ట్‌ఫిల్మ్‌ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతిభను చాటుకునే సదావకాశం!

షార్ట్‌ఫిల్మ్‌ రూపొందించడంలో అనుభవం ఉందా? మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ అలాంటి వారికి సదావకాశం కల్పిస్తోంది. తర్వాతి తరం కథకులను అన్వేషించడంలో భాగంగా ‘టేక్‌ టెన్‌’ పేరిట షార్ట్‌ఫిల్మ్‌ వర్క్‌షాప్‌, పోటీని నిర్వహిస్తోంది. దేశ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.

Millets: చిన్నారుల చక్కని ఎదుగుదలకు తోడ్పడే చిరుధాన్యాలు..!

9.మహేష్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌.. రూ.12కోట్లు మాయం

సైబర్‌ నేరగాళ్ల దోపిడీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు.

10.గెలవాల్సిన మ్యాచులను అప్పనంగా అప్పగించేశారు.!

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా 0-3 తేడాతో ఘోర పరాజయం పాలుకావడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను అప్పనంగా అప్పగించేశారని విమర్శలు గుప్పించారు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని