Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం

Updated : 19 Feb 2022 21:15 IST

1. ఒక్కసారిగా తగ్గిపోయిన కరోనా పరీక్షలు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. కేసుల సంఖ్య దిగివస్తుండటంతో పరీక్షలు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. అయితే ఇలా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. వ్యాప్తిలో ఉన్న వైరస్‌ను కట్టడి చేయాలన్నా.. పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను గుర్తించాలన్నా టెస్టులు కీలకమని, వాటిని కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు.

2. పీకేతో నితీశ్‌ కుమార్‌ డిన్నర్‌.. ఆంతర్యమేంటో..?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి దిల్లీలోని నితీశ్‌ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. రెండేళ్ల క్రితం జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ నుంచి పీకేను తప్పించిన తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాత అనుబంధాల కారణంగానే పీకేతో తాను సమావేశమైనట్లు నితీశ్ కుమార్‌ మీడియాకు తెలిపారు. అటు పీకే కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. 

3. Medaram 2022: జనం నుంచి వనంలోకి సమ్మక్క-సారలమ్మ

 మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ తల్లి, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు, ఏటూరు నాగారం కొండాయికి గోవిందరాజులు చేరుకోనున్నారు. 

Health tips: బ్రెయిన్‌ స్ట్రోక్‌.. గోల్డెన్‌ అవర్‌ ప్రాధాన్యత ఏంటి?

4. టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ..

టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా సారథిగా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌, వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌లలో ఒకరిని సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ సెలక్టర్లు రోహిత్‌ వైపే మొగ్గుచూపారు. దీంతో అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌ సారథిగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ‘గని’ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు..

5. ఏపీలో ఎక్కడా కరెంటు కోతలు లేవు: ఇంధనశాఖ కార్యదర్శి

రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. రోజుకు 204 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందన్నారు. జెన్‌కో, కృష్ణపట్నం పోర్టు, సౌర, పవన విద్యుత్‌ కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌ సరిపోక పోవడం వల్ల బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తు్న్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.7,700 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.

6. రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌... ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాలపై పోరాటం, దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ దేశ ఆర్థిక రాజధానికి పయనంకానున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన మహారాష్ట్ర సీఎం.. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్‌ న్యాయం కోసం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

7. ఉద్యోగ నియామకాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యోగ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం... ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు 95శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. అదే తరహాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Viral Video: ఆస్తి కోసం కన్నతండ్రినే చితక్కొట్టాడు!

8. అవినీతిపరులంతా కలిసి నన్ను ఉగ్రవాది అంటున్నారు..

వేర్పాటువాది అంటూ కాంగ్రెస్‌, భాజపా చేస్తున్న వ్యాఖ్యలను మరోసారి తిప్పికొట్టారు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని అవినీతిపరులంతా తనపై ఉగ్రవాది ముద్ర వేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్మార్ట్ క్లాస్‌రూం’ల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్‌ భాజపా, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. ఈ ఉగ్రవాదే నేడు 12,430 స్మార్ట్‌ క్లాస్‌రూంలను దేశానికి అంకితమిచ్చాడు అని వ్యాఖ్యానించారు.

9. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం

గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడటాన్ని కూడా ఈసీ నిషేధించింది. నోటీసుకు స్పందన లేకపోవడంతో రాజాసింగ్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్‌ ఇటీవల వీడియో విడుదల చేశారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

10. రాఖీభాయ్‌ ఏం చేయబోతున్నాడు?

ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్‌2’(KGF Chapter 2) ఒకటి. యశ్‌(Yash) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌-1’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు తమిళ నటుడు విజయ్ ‘బీస్ట్‌’, షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ చిత్రాలు కూడా ఏప్రిల్‌ 14నే విడుదల చేస్తామని ఆయా చిత్ర బృందాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని