Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 24 May 2022 21:01 IST

1. వాటిపై ప్రజల విశ్వాసం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్: కేటీఆర్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చర్చాగోష్టిలో ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్ - మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్’’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. 

2. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు

కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

3. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి: పవన్‌

కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.  అంబేడ్కర్‌ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్‌.. ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.


Video: న్యాయం ఎటువైపు ఉంటే జగనన్న అటువైపే: రోజా


4. ప్రభుత్వ గృహ సముదాయాలను ఖాళీ చేయండి..!

ఎయిర్‌ ఇండియాను దక్కించుకొన్న తర్వాత  టాటా గ్రూప్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎయిర్‌ ఇండియా సిబ్బంది ప్రస్తుతం ఉంటున్న ప్రభుత్వ హౌసింగ్‌ కాలనీలను జులై 26 లోపు ఖాళీ చేయాలని కోరింది. ‘‘జులై 26 నాటికి ఉద్యోగులు కంపెనీ కేటాయించిన ఇళ్లను ఖాళీ చేయాలని కోరుతూ.. మే 17వ తేదీన ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ నుంచి మెయిల్‌ వచ్చింది. ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్‌ మెకానిజం  ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని మే 18న ఎయిర్‌ ఇండియా వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది.

5. మా కారును పేల్చాలంటే న్యూక్లియర్‌ బాంబు కావాలి: ఆనంద్‌ మహీంద్రా

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, వారికి చేయూతనందిస్తుంటారు. నెటిజన్ల నుంచి ఆసక్తికరమైన, వింత ప్రశ్నలు ఎదురైనప్పుడు అంతే ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ నవ్వులు పంచుతోంది. స్కార్పియో-ఎన్‌ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి ఓ కొత్త వాహనాన్ని ప్రవేశపెడుతోందని ఆనంద్‌ మహీంద్రా తాజాగా వెల్లడించారు.


అవినీతి ఆరోపణల కేసులో పంజాబ్ ఆరోగ్యమంత్రి విజయ్ సింగ్లా అరెస్ట్


6. ఈ-బస్సులు మీవే.. జాగ్రత్త! మూడు రోజులు ఉచిత ప్రయాణం!

దేశ రాజధాని నగరం దిల్లీలో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మంగళవారం 150 విద్యుత్‌ బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఏడాదిలో 2000 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రూ.1862 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ-బస్సులో ఆయన ప్రయాణించారు.

7. హర్మన్‌ టీమ్‌పై దీప్తి శర్మ జట్టు ఘన విజయం

మహిళల టీ20 ఛాలెంజ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టుపై దీప్తి శర్మ టీమ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ టీమ్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది. షెఫాలీ వర్మ (51), లారా వాల్వార్డ్‌ (51) అర్ధశతకాలు సాధించారు. దీప్తి శర్మ (24*), యస్తిక భాటియా (17) ఫర్వాలేదనిపించారు.

8. భారత్‌లో బీఏ.5 వేరియంట్‌ మరో కేసు నమోదు

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన బీఏ.5 రకం మరో కేసు నమోదైంది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ యువకుడిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను తమిళనాడు, తెలంగాణలలో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.


Viral Dance: వైరల్‌ అవుతున్న ఈ ‘హైటెక్‌-భారతీయం’ నృత్యం చూశారా?


9. మేరియుపోల్‌లో భవన శిథిలాల కింద 200 మృతదేహాలు!

రష్యా సేనలు ముప్పేట జరిపిన దాడులతో ఉక్రెయిన్‌లో అందమైన పోర్టు సిటీగా పేర్గాంచిన మేరియుపోల్‌ శ్మశానంలా మారింది. అక్కడ తవ్వేకొద్దీ శవాల గుట్టలు బయటపడుతుండటంతో భయానక వాతావరణం నెలకొంది. రష్యా సేనలు దాదాపు మూడు నెలలుగా జరిపిన దాడులతో దద్దరిల్లిన మేరియుపోల్‌లో తాజాగా ఓ భవనం శిథిలాల కింద 200 మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. కార్మికులు భవనం వద్ద శిథిలాలను తవ్వుతుండగా 200 మృతదేహాలు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

10. సల్మాన్‌ఖాన్‌ ఆఫర్‌ ఇస్తే ‘నో’ చెప్పా: తరుణ్‌ భాస్కర్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ సినిమా ఆఫర్‌ ఇస్తే తాను నో చెప్పానని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెలిపారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను మాంసాహారాన్నే ఎక్కువగా ఇష్టపడతానని, శాకాహారం తినాలంటే భయపడతానని చెప్పుకొచ్చారు. తన కుటుంబానికి సినీ నేపథ్యం లేదని, లఘు చిత్రాలు తీసిన అనుభవంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని