Updated : 28 May 2022 21:03 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: చంద్రబాబు

సీఎం జగన్‌ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడు వేదికగా నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అంచనాలకు మించి హాజరైన తెదేపా శ్రేణులను ఉద్దేశించి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. క్విట్‌ జగన్‌ - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని 5కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

2. జగన్‌ది కేవలం ‘మందు’ చూపు మాత్రమే: లోకేశ్‌

తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెదేపా పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు శివారు మండువవారిపాలెంలో మహానాడు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేశ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు.


Video: చంద్రబాబు మహానాడును నిర్వహించడం హాస్యాస్పదం : రోజా


3. మంకీ పాక్స్‌ ఉద్ధృతి దృష్ట్యా అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ
పలు దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు  వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల మంకీ పాక్స్‌ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్‌ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను అదేశించింది. అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు.

4. తెదేపాని అధికారంలోకి తెస్తేనే అందరికీ భవిష్యత్తు: బాలకృష్ణ

దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టోయ్.. అనే రీతిలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  విమర్శించారు. మూడేళ్ల పాలనలో ధరలు పెరిగాయని.. అన్ని రకాల ఛార్జీల పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. మహానాడు వేదికగా ఒంగోలులో నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడారు.

5. హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు సవరించిన తెలంగాణ ప్రభుత్వం

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి నివాస భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు సవరించింది. జీహెచ్‌ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించనుంది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Video: 14మందిని రక్షించిన ‘బాహుబలి’ క్రేన్‌ను చూశారా?


6. తీన్మార్‌ మల్లన్న అరెస్టు... అరెపల్లిలో ఉద్రిక్తత
హనుమకొండ జిల్లా అరెపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ అరెపల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో గ్రామసభ నిర్వహించిన రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు రైతులకు మద్దతుగా మల్లన్న మట్లాడుతూ... బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. 80ఏ జీవోను రద్దు చేసే వరకు రైతులు ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడాలన్నారు. మల్లన్నను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

7. వాటర్‌ బాటిల్‌ డిజైన్ సూచించండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండి: టీఎస్‌ఆర్టీసీ

మంచి వాటర్ బాటిల్ డిజైన్‌ సూచించండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఓ ప్రకటన చేసింది. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్, డిజైన్ సూచించాలని ట్విటర్‌ వేదికగా కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్ పంపుతారో వారికి ప్రైజ్ ఇస్తామని చెప్పారు.

8. నేనో ఫూల్‌ని.. కోర్టులో పాక్‌ ప్రధాని వ్యాఖ్యలు

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శనివారం ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. తానో తెలివితక్కువ వాడినని, అందుకే పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదంటూ పీఎం వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్‌, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది.


Video: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడికి పుట్టిన రోజు వేడుక


9. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 ఉపవేరియంట్ల కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు.

10. ‘మా జట్టు ఫైనల్‌ చేరినా నేను సంతోషంగా లేను’

టీ20 లీగ్‌పై గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్‌ చేరినా సంతోషంగా లేనని వేడ్‌ పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్‌ చాలా చిరాకు కలిగిస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో గుజరాత్, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. అరంగేట్ర సీజన్‌లోనే మేటి జట్లను మట్టికరిపించి ఏకంగా ఫైనల్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది గుజరాత్‌ జట్టు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని