Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 26 Jun 2022 21:27 IST

1. 28న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు  ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ గతంలోనే ప్రకటించారు.

2. జూన్‌ 26కు చాలా ప్రత్యేకత ఉంది: రేవంత్‌ రెడ్డి

ఈరోజు(జూన్‌ 26)కు చాలా ప్రత్యేకత ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. తనను నమ్మి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలని సోనియా గాంధీ.. పీసీసీ పదవి అప్పగించారని తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  దళితులు, గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. నిరుద్యోగ జంగ్‌ సైరన్‌తో యువతకు అండగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడామని తెలిపారు.

3. మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?

మహారాష్ట్ర సీఎం, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే.. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ‘వర్ష’ను వీడి తన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్న విషయం తెలిసిందే. ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. కూటమి ప్రభుత్వం కూలిపోయేదశలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి చేరుకోవడంపై పలు విశ్లేషణలు జరుగుతున్నాయి.


Viral Video: 100 మంది సైనికులు..వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి..!


4. ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!

ఆ గ్రామం ఎన్నోఏళ్లుగా చీకట్లో మగ్గుతోంది. తమ ప్రాంతానికి కరెంటు వసతి కల్పించాలని ఎంతో కాలంగా స్థానికులు వేడుకుంటున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు. అయితే, ఇటీవల ఆ గ్రామం జాతీయస్థాయి వార్తల్లో నిలవడంతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.

5. ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్‌.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?

విదేశీ ప్రయాణం చేయాలంటే.. పాస్‌పోర్ట్‌తోపాటు వీసా తప్పనిసరి. అయితే పాస్‌పోర్ట్ పొందడం అంత సులభమైన ప్రక్రియేమీ కాదు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని, పోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు లేవని రుజువైతే నేరుగా ఇంటికే వస్తుంది. ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే తిరిగి కొత్తది పొందడం మరో పెద్ద పని. అంతేకాదు.. అందులోని సమాచారం ఇతరుల చేతికి చేరుతుందనేది మరో బాధ. మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌లు కట్టడి కూడా కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది.

6. పిరికివారే వెళ్లిపోయారు.. దమ్ముంటే శివసేనను వీడి పోరాడండి..!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోన్న వేళ.. శివసేన  రెబల్‌ నేతలపై ఆదిత్యఠాక్రే విమర్శలు ఎక్కుపెట్టారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచివెళ్లారన్న ఆయన.. రెబల్‌ నేతలకు భద్రత కల్పించడమేంటని ప్రశ్నించారు. కశ్మీరీ పండితులకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత అవసరమని.. గుహవాటికి పారిపోయిన వాళ్లకు కాదంటూ శిందే క్యాంపుపై విమర్శలు గుప్పించారు. ముంబయిలోని కలీనా, శాంటాక్రజ్ ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడిన ఆదిత్య ఠాక్రే శివసేన గుర్తును, ప్రజల ప్రేమను రెబల్‌ నేతలు తీసుకెళ్లలేరంటూ వ్యాఖ్యానించారు.

7. రష్యా బంగారంపై నిషేధం ?

రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్‌లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఈ నిర్ణయం పుతిన్‌ యుద్ధ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూకే పేర్కొంది. 2021లో రష్యా 15.4 బిలియన్‌ డాలర్లు విలువైన స్వర్ణాన్ని ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభం కావడంతో రష్యా సంపన్నులు దీని కొనుగోళ్లను గణనీయంగా పెంచారు.


Bypoll Results: ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా


8. యూఎస్‌ ఓపెన్‌కు అనుమతించకపోయినా వ్యాక్సిన్‌ వేసుకోను: జకోవిచ్

ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వాక్సినేషన్‌ వేసుకోనని మరోసారి తేల్చిచెప్పాడు టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌. ఇప్పటికే ఈ కారణం చేత ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడలేకపోయిన అతడు త్వరలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ అలాంటి పరిస్థితే ఎదురైతే పట్టించుకోనని చెప్పాడు. దీంతో ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో ఈ సెర్బీయా ఆటగాడికి రేపటి నుంచి ప్రారంభమయ్యే వింబుల్డన్‌ టోర్నీనే చివరిది కానుంది. అతడు తిరిగి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొనాలంటే వచ్చే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరకు వేచి చూడాల్సిందే.

9. ‘అగ్నిపథ్‌’పై వెనక్కి తగ్గని కేంద్రం.. కోటా సంగతి తేల్చని రాష్ట్రాలు..!

అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తొలి ఏడాది వయసు విషయంలో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించింది. రెగ్యులర్‌ సర్వీసులో వీరికి ప్రాధాన్యం ఇస్తామని కూడా ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించగా.. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. ఈ విషయంలో రాజకీయ కారణాలు ఎలా ఉన్నా.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చే అగ్నివీరుల కోసం ఇప్పటి వరకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రాలు గానీ ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించకపోవడం గమనార్హం.

10. భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు కారణాలివే..

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు అలుముకోవడంతో ఇటీవల ఈక్విటీ మార్కెట్లు ఏడాది కనిష్ఠానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, వరుస నష్టాల నుంచి గతవారం మార్కెట్లు కొంత ఉపశమనం పొందాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఈవారం సెన్సెక్స్‌ 1400 పాయింట్లు ఎగబాకింది. అయినా విదేశీ మదుపర్ల అమ్మకాలు మాత్రం ఆగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని