Published : 02 Jul 2022 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మోదీ మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలి... కార్యవర్గ భేటీలో నేతల అభిప్రాయం

హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారిత, స్వతంత్రతను మన స్వాతంత్ర్య సమరయోధులు ఆశించారని.. ఇవాళ భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం.. ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు నడ్డా గుర్తు చేశారు.

2. తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య మరోసారి వార్‌ మొదలైంది.
యశ్వంత్‌ సిన్హాను కలిసేందుకు తాము సిద్ధంగా లేమని రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ను కలవాలనుకున్నా.. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని స్పష్టం చేశారు.


Video: విధుల్లో చేరాలంటే ఎమ్మెల్యే సోదరుడ్ని కలవాల్సిందే..!


3. కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్‌

భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించారు. వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని క్రియాశీలక సభ్యులు ఈ తరగతుల్లో పాల్గొన్నారు.

4. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇవ్వండి.. రుచికరమైన భోజనం అందిస్తాం.. ఓ కేఫ్‌ వినూత్న ప్రకటన

గుజరాత్‌లోని ఓ కేఫ్‌ వినూత్న ప్రకటన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు అందజేస్తే.. రుచికరమైన భోజనం అందిస్తామంటూ ప్రకటించి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన ‘నేచురల్‌ ప్లాస్టిక్‌ కేఫ్‌’ ప్రకటన వైరల్‌గా మారింది. జులై 1నుంచి పలు ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో కేఫ్‌ ఈ తాజా ప్రకటన చేయడం విశేషం.

5. నుపుర్‌ శర్మపై లుక్ అవుట్‌ నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెన్షన్‌కు గురైన నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా  నుపుర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలోనూ ఆమెపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.


Video: మన్యం వీరుడి అల్లూరిపై ప్రత్యేక పాట.. లాంచ్‌ చేసిన రఘురామ!


6. 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్‌హోస్టెస్‌గా.. ఈ బామ్మ గిన్నిస్‌ రికార్డ్‌..!

సాధారణంగా 60 ఏళ్లు దాటగానే చాలా మంది రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. కానీ ఈ బామ్మ ఎనిమిది పదుల వయసులోనూ ఎంతో చలాకీగా ఉద్యోగం చేస్తోంది. అది ఏ చిన్నా చితకా సంస్థలో మామూలు ఉద్యోగం కాదండోయ్‌.. ఓ పేద్ద విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టస్‌గా. గత ఆరు దశాబ్దాలుగా ఒకే కంపెనీలో సుదీర్ఘంగా సేవలందిస్తోన్న ఈ బామ్మ.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కులైన ఫ్లైట్‌ అటెండెంట్‌గా గిన్నిస్‌ రికార్డు కూడా సాధించేసింది.

7. అప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు వాయిదా వేయడం.. సమర్థనీయమే: రవిశాస్త్రి

గతేడాది కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్‌ 338/7 స్కోరు చేసింది. రిషభ్‌ పంత్ (146) శతకానికితోడు రవీంద్ర జడేజా (83*) సమయోచిత ఇన్నింగ్స్‌ టీమ్‌ఇండియాను నిలబెట్టింది. ఈ క్రమంలో టెస్టు మ్యాచ్‌పై భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి స్పదించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా రవిశాస్త్రినే టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించాడు.

8. అదరగొట్టిన డీమార్ట్‌.. క్యూ1లో ఆదాయం డబుల్‌

డీమార్ట్‌ (D-Mart) పేరిట రిటైల్‌ సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.9,806.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,031.75 కోట్లు. గతేడాదితో పోల్చినప్పుడు ఆదాయం దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ విషయాన్ని అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ బీఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.


Video: దక్షిణ చైనా సముద్రంలో మునిగిన ఓడ.. 24 మంది మృతి


9. ఐటీ పోర్టల్‌ను వదలని సమస్యలు.. ఈ ఫైలింగ్‌లో యూజర్లకు తప్పని పాట్లు!

ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను తీసుకొచ్చి ఏడాది గడిచినప్పటికీ బాలరిష్టాలు దాటడంలో ఇబ్బందులు పడుతూనే ఉంది. ఐటీ రిటర్నుల దాఖలు వేళ.. ఈ పోర్టల్‌ మరోసారి యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ఐటీ శాఖ.. ఈ విషయాన్ని పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.

10. ఉదయ్‌పుర్ దర్జీ హత్య కేసు.. కోర్టు ప్రాంగణంలో నిందితులపై దాడి..!

రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్య కుమార్‌ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాశవికంగా వ్యవహరించిన నిందితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వీరిని పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు.  ఈ క్రమంలో ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు వారిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అధికారులు  జైపూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని