Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 05 Aug 2022 20:56 IST

1. ఎన్టీఆర్ కుమార్తెది ఆత్మహత్యే.. పోలీసులకు చేరిన పోస్టుమార్టం నివేదిక

ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఉస్మానియా ఫొరెన్సిక్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన ఉమా మహేశ్వరి తన గదిలో మృతిచెంది ఉండడాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

2. రాజగోపాల్‌ రెడ్డి లాంటి విశ్వాసఘాతకుడిని చూడలేదు: రేవంత్‌రెడ్డి

మునుగోడు గడ్డమీద కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని శ్రేణులను కోరారు. గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని.. అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.


Video: గోరంట్ల మాధవ్‌ను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి: తెదేపా


3. ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయితోపాటు ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు గానూ గురువారం దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. నాలుగు రోజులపాటు రాజధానిలోనే పర్యటించననున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ మమతా భేటీ కానున్నారు.

4. గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు

నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి ఊరట కలిగించే వార్త ఇది. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు.

5. టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష..సెమీస్‌లో నెగ్గాలంటే ఏం చేయాలి?

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. శనివారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఫైనల్‌ బెర్త్‌కోసం బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఒకవైపు టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో అనూహ్య పరాజయం తరవాత వరుసగా రెండు భారీ విజయాలతో జోరు మీదుండగా.. మరోవైపు ఈ టోర్నీలో ఓటమి రుచి చూడని ఇంగ్లిష్‌ జట్టు సూపర్‌ఫామ్‌లో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య సెమీస్‌పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది.


Video: తైవాన్‌ను ఏకాకి చేస్తానంటే ఊరుకోం: పెలోసీ


6. ఎన్నారైలకు RBI గుడ్‌న్యూస్‌.. విదేశాల నుంచీ బిల్‌ పేమెంట్స్‌!

ఉద్యోగం కోసం దేశం కాని దేశం వెళుతుంటారు కొందరు. వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులు స్వదేశంలో నివసిస్తుంటారు. వారి ఇంటి కరెంట్‌ బిల్లో, ఇంకోటో చెల్లించాలంటే విదేశాల్లో ఉండే వారికి వీలయ్యేది కాదు. దీంతో బిల్‌ పేమెంట్‌ కోసం స్వదేశంలో ఉన్న తెలిసిన వారినో, స్నేహితులనో ఆశ్రయించాల్సి వచ్చేది. ఇలాంటి వెతలు త్వరలో తొలగిపోనున్నాయి. ఎన్నారైల కోసం ఆర్‌బీఐ కొత్త సదుపాయం తీసుకొస్తోంది. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా బిల్లు పేమెంట్స్‌ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది.

7. ఆరేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు.. ఈ ఒక్క ఏడాదే 18 వేలు..!

ఆరేళ్ల కాలంలో భారత రైల్వే కింద మూడున్నర లక్షల మందికిపైగా ఉద్యోగం పొందారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. దేశ యువతకు ఉపాధి కల్పించడంలో రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తోందని, ఈ ఒక్క ఏడాదే 18 వేల ఉద్యోగాలు అందించిందని చెప్పారు. 2014 నుంచి 2022 మధ్య భారత రైల్వే కింద 3,50,204 మందికి ఉద్యోగం లభించిందని తెలిపారు.

8. పెలోసీ పర్యటన ఎఫెక్ట్‌.. అమెరికాతో చైనా చర్చలు బంద్‌

తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ తైవాన్‌లో పర్యటించడంపై గుర్రుగా ఉన్న చైనా.. అగ్రరాజ్యంపై ప్రతిచర్యలకు పూనుకుంది. ఇప్పటికే పెలోసీపై ఆంక్షలు విధించిన డ్రాగన్‌ సర్కారు.. తాజాగా అమెరికాతో పలు అంశాలపై చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాతావరణ మార్పుల దగ్గర్నుంచి, సైనిక సంబంధాలు, మాదకద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలను నిలిపివేయడం లేదా రద్దు చేస్తున్నట్లు చైనా వెల్లడించింది.


viral video: మహిళ పై అంబులెన్స్ డ్రైవర్ దాడి


9. ‘తైవాన్‌’ ప్రభావం మనపై తక్కువే: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఉద్రిక్తలు రాజేసింది. తైవాన్‌ను చైనాలో అంతర్భాగంగా భాగంగా భావిస్తూ వస్తున్న డ్రాగన్‌కు ఈ చర్య చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలకు దిగింది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గామి వంటి వాటిని మోహరిస్తోంది. ఇది ఉక్రెయిన్‌ - రష్యా పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలూ వినవస్తున్నాయి. ఒకవేళ అలాంటిదేమైనా జరిగిన భారత్‌పై ప్రభావం తక్కువేనని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.

10. భీకర యుద్ధం వేళ.. రష్యా అబ్బాయి-ఉక్రెయిన్‌ అమ్మాయి వివాహం

రష్యా జరుపుతోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ పౌరులు  వణికిపోతున్నారు. రష్యా సేనలు చేస్తోన్న అకృత్యాలకు చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి భయానక సమయంలో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణాలు చేతపట్టుకొని ఆశ్రయం కోసం పొరుగు దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఇలా ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న వేళ.. ఇవేమీ తమ జీవితానికి అడ్డుకావంటూ శత్రుదేశాలకు చెందిన ఓ ప్రేమజంట ముందుకు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని