Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Published : 29 Nov 2022 20:58 IST

1. Telangana News: వైఎస్‌ షర్మిల ఫైటర్‌.. తగ్గేదేలే: బ్రదర్‌ అనిల్‌

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్‌ షర్మిలను ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైతెపా వాహనాలు ధ్వంసం చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టలేదని, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Telangana News: మరో 16వేల పోస్టుల భర్తీకి త్వరలో అనుమతులు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇప్పటి వరకు 60వేల పైచిలుకు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. మరో 16వేలకు పైగా పోస్టులకు త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: జగనన్న సాంస్కృతిక సంబురాల్లో మంత్రి రోజా సందడి

3. Hyderabad Metro: తొలిసారిగా హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో: ఎన్వీఎస్ రెడ్డి

మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ. మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Bandi sanjay: భయపడొద్దు.. వచ్చేది భాజపా ప్రభుత్వమే: బండి సంజయ్‌

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా భైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: చైనాలో యాపిల్‌ సంస్థకు తీవ్రమైన కష్టాలు

5. Narco test: ఆఫ్తాబ్‌కు నార్కో పరీక్షకు కోర్టు ఓకే‌.. అసలేమిటీ నార్కో ఎనాలసిస్‌?

సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలాకు నార్కో పరీక్ష జరిపేందుకు దిల్లీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్తాబ్‌ తరఫు న్యాయవాది అభినాశ్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితుడిని డిసెంబర్‌ 1, 5 తేదీల్లో దిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి తీసుకెళ్లేందుకు పోలీసులు దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం అందుకు అనుమతించిందని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Digital rupee: 1 నుంచి డిజిటల్‌ రూపాయి.. ప్రయోగాత్మకంగా తొలుత ఈ నగరాల్లోనే

దేశంలో డిజిటల్‌ రూపాయి వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌ 1 నుంచి రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని (e₹-R) పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ సహా నాలుగు బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరించే ఈ డిజిటల్‌ రూపాయికి సంబంధించి నవంబరు 1న పైలట్‌ ప్రాజెక్టుగా టోకు విభాగంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: కుమార్తె పరామర్శకు యత్నం.. వైఎస్‌ విజయమ్మ గృహనిర్బంధం

7. Arshdeep Singh: ఉమ్రాన్‌తో పోటీ లేదు.. అతడుంటే నాకే ప్రయోజనం: అర్ష్‌దీప్‌

అర్ష్‌దీప్‌ సింగ్‌ మీడియం పేసర్.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్ట్‌కే ఫాస్ట్‌ బౌలర్‌. వీరిద్దిరి మధ్య సహజంగానే జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కానీ ఉమ్రాన్‌ ఓ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేయడం వల్ల తనకు ఎంతో ప్రయోజనమని అర్ష్‌దీప్‌ చెప్పడం విశేషం. ఉమ్రాన్‌ మాలిక్‌తో బౌలింగ్‌ చేయడంపై అర్ష్‌దీప్‌ స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

8. Forbes list: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో అదానీ టాప్‌.. టాప్‌-100లో 30 శాతం సంపద వారిద్దరి వద్దే!

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి క్షీణత, ఉద్యోగ కోతలు, మాంద్యం భయాలు.. ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలివీ. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే సమయంలో భారత్‌లో కుబేరుల సంపద రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో టాప్‌-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 800 బిలియయన్‌ డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే వీరి సంపద 25 బిలియన్‌ డాలర్లు మేర పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Andhra News: సీఎస్‌ సమీర్‌శర్మ కోసం కొత్త పోస్టు సృష్టించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సీఎస్‌గా (ఈనెల 30న) బుధవారం పదవీ విరమణ చేయనున్న సమీర్‌శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టు సృష్టించింది. పదవీవిరమణ అనంతరం ఆయన్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో చీఫ్‌ సెక్రటరీగా సమీర్‌ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కోసం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Ukraine Crisis: రష్యాకు భారీ సైనిక నష్టం.. 1500 మంది సైనికాధికారులు మృతి..!

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా వైపు భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నట్లు చెబుతున్నాయి. ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో 1500 మందికి పైగా రష్యా సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో 160 మందికిపైగా జనరల్‌ స్థాయి అధికారులున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు