Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jan 2023 21:07 IST

1. అండర్‌ - 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమ్‌ఇండియా

భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. తొలిసారి నిర్వహించిన అండర్‌ - 19 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న భారత్‌..ఇంగ్లాండ్‌ను కేవలం 17.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూల్చింది. అనంతరం కేవలం 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. సమరానికి సై.. పార్లమెంట్‌లో భారాస వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో   అనుసరించాల్సిన వ్యూహంపై భారాస ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. దాదాపు 3గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

3.భారత్‌ బ్రాండ్‌ పెరగాలంటే..!

భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ముఖ్యం ఇంధన ఎగుమతులే. ప్రస్తుతం భారత్‌లో సుమారు 140 కోట్ల మంది జనాభా ఉండటంతో దేశీయ వినియోగంతోనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. కానీ, ఇది ఒక స్థాయిదాకానే దేశ ప్రగతిని తీసుకెళ్లగలదు. అక్కడి నుంచి ముందుకు పోవాలంటే ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంటుంది. 2022లో భారత్‌లో 420 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇదే సమయంలో చైనా ఏకంగా 3.6 ట్రిలియన్‌ డాలర్లను చేయడం గమనార్హం. ఈ గణాంకాలు భారత ఎగుమతుల స్థాయిని చెబుతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లలో కొందరు ప్రయాణికులు తిని పడేసిన చెత్తా చెదారంతో నిండి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw) స్పందించారు. ఇకపై ఈ రైళ్ల(Vande Bharat Trains Trains)లో క్లీనింగ్‌ విధానాన్ని మార్చాలని అధికారులను ఆదేశించారు. విమానాల్లో తరహాలో క్లీనింగ్‌ ప్రక్రియ అనుసరించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్‌ ఖాతాలో పదో టైటిల్‌.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్‌

సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ 2023 టైటిల్‌ ఫైనల్‌లో సిట్సిపాస్‌పై అద్భుత విజయం సాధించాడు. దీంతో పదో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకొన్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 6-3, 7-6, 7-6 తేడాతో సిట్సిపాస్‌పై జకోవిచ్‌ గెలుపొందాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6.తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన సమంత

అగ్ర కథానాయిక సమంత(Samantha) ప్రస్తుతం మయోసైటిస్‌ నుంచి కోలుకుంటోంది. తన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఆమె తాజా పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కళ్లజోడు పెట్టుకున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న ఆమె ‘‘ఈ గ్లాసెస్‌ నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్స్‌’’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ‘‘ఈ కళ్లజోడు వల్ల మీ అందం మరింత పెరిగింది’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. వారి అభిమాన నటి మళ్లీ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

 ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి. దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్‌ పార్సన్స్‌ మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్‌ నేవడలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు

ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రగతి నివేదికలు గతేడాది కంటే మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి పని చేయడం వల్లే  ఇంతటి వృద్ధి సాధించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నివేదికను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్ఘటనలు ఎదురైనప్పుడు సమీక్షలు చేసి వాటిని సరిదిద్దుతున్నామన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి

 భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం  విజయ్‌చౌక్‌ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్‌(Beating Retreat) కార్యక్రమం అలరిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు భళా అనిపిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఏఎస్సై కాల్పుల ఘటన.. ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత

ఒడిశా(Odisha)లోని బ్రిజరాజ్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌(Naba kisore Das) కన్నుమూశారు. ఛాతీ భాగంలోకి రెండు తూటాలు దూసుకెళ్లడంతో చికిత్సపొందుతూ ఆయన ప్రాణాలు విడిచినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తొలుత  ఆస్పత్రికి తీసుకురాగానే డాక్టర్‌ దేబాశిస్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తులవైపు దూసుకెళ్లిన బుల్లెట్‌ తీవ్ర గాయం చేయడంతో అధిక రక్తస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు