Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Jul 2022 08:55 IST

1. శ్వాస ద్వారా కొవిడ్‌ టీకా

హ్యూస్టన్‌: ముక్కు ద్వారా పీల్చే రూపంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అమెరికన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వైద్య సిబ్బంది సాయం లేకుండా ఎవరికివారు సొంతంగా తీసుకోవచ్చు. ఈ టీకా నిల్వకు శీతల సదుపాయం కూడా అక్కర్లేదు. సాధారణ ఉష్ణోగ్రతలోనే మూడు నెలల వరకు భద్రపరచవచ్చు. మనుషులు కరోనా వైరస్‌ కొమ్ములోని సూక్ష్మభాగాన్ని శ్వాస ద్వారా టీకా రూపంలో తీసుకున్నప్పుడు మన రక్షణ వ్యవస్థ వెంటనే యాంటీబాడీలను తయారు చేస్తుందని పరిశోధకులు వివరించారు. వారి అధ్యయనం నేచర్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ పత్రికలో ప్రచురితమైంది. ప్రస్తుతం ఇంజక్షన్‌ ద్వారా ఇస్తున్న కొవిడ్‌ టీకా శ్వాసకోశంలోకి అంత సమర్థంగా చేరలేకపోతోంది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అతిశీతల వాతావరణంలో భద్రపరచాలి. వాటిని సుశిక్షిత వైద్య సిబ్బంది మాత్రమే ఇవ్వగలరు.

2. వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్లు ఇంకా ఎందుకు రాలేదు?

చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేనిదే రోజు గడవని కాలమిది. పరాకుగా ఉన్నప్పుడో, సెల్ఫీ తీసుకుంటున్నప్పుడో, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడో.. నాజూకైన ఫోన్లు చేతిలోంచి చటుక్కున జారి నీళ్లలో పడటం సర్వ సాధారణం. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మోడళ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన చరవాణులు మార్కెట్లోకి వస్తున్నా..

3. గూండాలకు భయపడను.. దమ్ముంటే చర్యలు తీసుకోండి

కాళీని మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ... తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్ర చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన మొయిత్రను అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు.

4. మీ వాహనాన్ని ఎలా నడుపుతున్నారు?

వాహనాన్ని రోజూ ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు.. వాహనాన్ని నడిపేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఎందుకీ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఇక నుంచి వాహన బీమా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. వాహన వినియోగం, డ్రైవర్‌ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం వసూలుకు అధునాతన అనుబంధ పాలసీలను (యాడ్‌ ఆన్‌) కంపెనీలు జారీ చేయబోతున్నాయి.

5. కూర్పు కళలో రారాజు

రూపు తెరపై కనిపించకున్నా.. ఆ పేరెప్పుడూ సినీప్రియులకు సుపరిచితమే. కూర్పు కళలో స్టార్‌. తెరపై కనిపించని హీరో. ఎడిటింగ్‌ అంటే కత్తెరతో ఫ్రేమ్స్‌ కట్‌ చేయడమే కాదని.. ఏది కట్‌ చేయాలో.. ఏది కంటిన్యూ చేయాలో.. ఆర్డర్‌ మార్పులతో ఓ కథని ఎంత కొత్తగా, అందంగా చెప్పొచ్చో.. సూటిగా సుత్తి లేకుండా ప్రేక్షకుల్ని ఎలా రంజింపచేయొచ్చో.. విజయవంతంగా చేసి చూపిన కళా మాంత్రికుడాయన. ఎడిటింగ్‌ టేబుల్‌పైనే చిత్ర ఫలితాల్ని చెక్కగలిగిన.. చెప్పగలిగిన మేధావి. అందుకే స్టార్‌ హీరోల తొలి ఛాయిస్‌ ఎప్పుడూ ఆయనే. ఇప్పుడా కూర్పు కళా శిల్పి  చిత్రసీమను, కళాభిమానుల్ని విషాదంలోకి నెట్టేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

6. పాటకు పట్టం.. కథకు వందనం

దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబ లి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించిన కథారచయిత/దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)లను రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు నామినేట్‌ చేసింది.

7. మట్టి మింగేస్తున్నారు

కొండల్ని పిండి చేస్తున్నారు.. చెరువుల్ని చెరబడుతున్నారు.. కాలువ కట్టల్నీ కొల్లగొడుతున్నారు.. ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. మట్టి, గ్రావెల్‌, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. ఇది ఓ ఊరికో, ఓ జిల్లాకో పరిమితం కాలేదు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ అక్రమ తవ్వకాలే. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపులే. వీటన్నింటి వెనుకా కొంతమంది అధికార పార్టీ నేతలదే ప్రధాన హస్తం.

8. విదేశీ విద్య పెనుభారం

రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌ విలువ గణనీయంగా పెరగడంతో మన విద్యార్థులకు విదేశీ చదువు పెనుభారంగా మారింది. అమెరికాకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు కళాశాల రుసుములు, ఖర్చుల కోసం రూపాయల్లో మరింత అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం అత్యధికులు వెళ్లేది అమెరికాకే..

9. మళ్లీ స్పైస్‌‘జెర్క్‌’

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది. ఆ సంస్థకు చెందిన సరకు రవాణా విమానమొకటి (బోయింగ్‌ 737) కోల్‌కతా నుంచి మంగళవారం చైనాలోని చోంకింగ్‌కు వెళ్తుండగా వాతావరణ రాడార్‌ పనిచేయలేదు. టేకాఫ్‌ అయిన అనంతరం ఆ వైఫల్యాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని వెనక్కి మళ్లించి కోల్‌కతాలో సురక్షితంగా దించారు.

10. వాలంటీర్లతో ‘సాక్షి’ కొనిపించేందుకే నెలకు రూ.200

ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి సొంత పార్టీ కార్యకర్తలైన గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి జగన్‌ దోచి పెడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వార్తా పత్రికల కొనుగోలుకు ఒక్కో వాలంటీరుకు నెలకు రూ.200 చొప్పున ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి, వారితో సొంత పత్రిక సాక్షిని కొనుగోలు చేయించి, ఆ డబ్బును జగన్‌ తన సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని