Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 25 Jun 2024 09:03 IST

1. ఆర్టీసీ స్థలాలకు చెవిరెడ్డి స్కెచ్‌

రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఆర్టీసీ స్థలాలకు అగ్రిమెంట్‌ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి డిపోల పరిధిలోని స్థలాలను లీజు పేరుతో దక్కించుకున్నారు. పూర్తి కథనం.

2. ఏపీలో మెగా డీఎస్సీతోపాటు టెట్‌

మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  పూర్తి కథనం.

3. చట్టాన్ని చుట్టి.. వైకాపాకు సలాం కొట్టి..!

వైకాపా నేతలను తృప్తిపర్చడమే విధిగా కొందరు పోలీసు అధికారులు జిల్లాలో వ్యవహరించారు. ఐదేళ్లలో చట్టం చిన్నబోయేలా, వ్యవస్థలు సిగ్గుపడేలా ప్రవర్తించారు. పలు సందర్భాల్లో పోలీసు అధికారుల వైఖరితో సామాన్యులు, తెదేపా, జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్రమ కేసులు బనాయించి ముఖ్య సందర్భాల్లో క్షోభకు గురి చేశారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు సైతం స్వీకరించ లేదు. ప్రశాంతంగా ఉండే సిక్కోలును వైకాపా నేతల మాటలకు తలొగ్గి  వివాదాలకు ఆజ్యం పోశారు. పూర్తి కథనం. 

4. జోగి దొంగాటలో ముగ్గురు అవుట్‌!

రాష్ట్ర హోంశాఖ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ భూములను మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన వ్యవహారంలో ప్రాథమికంగా ముగ్గురు రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది. గ్రామీణ మండల తహసీల్దారు జాహ్నవి ఇచ్చిన నివేదిక ఆధారంగా గతేడాది గ్రామీణ మండలంలో డిప్యూటీ తహసీల్దారుగా (డీటీ) పని చేసిన విజయ్‌కుమార్, మండల సర్వేయరు రమేష్, గ్రామ సర్వేయరు దేదీప్యలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరు, సంయుక్త కలెక్టరు సంపత్‌కుమార్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పూర్తి కథనం.

5. ఇంటికే పింఛను!.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ

సామాజిక పింఛన్ల పంపిణీపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెలకు సంబంధించిన సొమ్మును గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయించాలని నిర్ణయించడంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఊరట లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,200 మంది సిబ్బంది ఉన్నారు. పూర్తి కథనం.

6. నేతకు జైకొట్టారు.. మేతకు ఊకొట్టారు

గుంటూరు నగరపాలికకు చెందిన కొందరు అధికారులు గత వైకాపా ప్రభుత్వంతో అంటకాగారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పిందే వేదంగా భావించి విధి నిర్వహణలో నడుచుకున్నారు. ప్రజాప్రయోజనం కన్నా వైకాపా నేతలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైకాపా నేతలు, కార్పొరేటర్ల అనధికారిక లేఔట్లు, కట్టడాల విషయంలో చూసీచూడనట్లు మిన్నకుండిపోయారు. పూర్తి కథనం.

7.గుడ్డు కథలు కాదు.. ‘నిబంధనలు పాటించాలిగా?’

‘నిబంధనలు ఎవరికైనా ఒకటే. సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా. సామాన్యులు అనుమతుల్లేకుండా చిన్న రేకుల షెడ్డు వేస్తే అధికారులు వెంటనే వెళ్లి కూలగొడతారు. అదే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నది పక్కనే నిర్మాణాలు చేపడితే ఒక న్యాయమా? అధికారంలోని వ్యక్తులే మాకు రూల్స్‌ వర్తించవు అంటే వ్యవస్థ బతకదు’... పూర్తి కథనం.

8.కోపం గుండెకు చేటు

తన కోపమె తన గుండెకు శత్రువు! అవును.. కోపంతో గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టు ఇప్పటికే అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కానీ ఇదెలా జరుగుతుందనేది తెలియదు. కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవలే దీని గుట్టును గుర్తించారు. ఈ అధ్యయనంలో కొందరికి కోపం తెప్పించే సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి కథనం.

9. భూసమస్యల పరిష్కారానికి ఏకీకృత చట్టం

రాష్ట్రంలో భూ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్‌) రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పాసుపుస్తకాలు- భూ దస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్వోఆర్‌) ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యలకు కేంద్రబిందువుగా మారిందన్న అభిప్రాయానికి సర్కారు వచ్చింది. భూ యజమానులందరికీ సులువుగా, అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. పూర్తి కథనం.

10.  105% పెరిగిన హైదరాబాద్‌ మెట్రో ఆదాయం

మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో అమాంతం పెరిగింది. ఏకంగా 105 శాతం పెరిగినట్లు ఆర్థిక నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా.. 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఫలితంగా నష్టాలు గతేడాది భారీగా తగ్గాయి. పూర్తి కథనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని