Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 May 2023 21:16 IST

1. సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్‌.. ఖర్గేను కలిసిన డీకేఎస్‌

కర్ణాటకలో కాంగ్రెస్‌(Congress) పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(డీకేఎస్‌) మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు నేతలూ దిల్లీలో ఉన్నారు. మంగళవారం దిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్‌.. ఈ సాయంత్రం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మరోవైపు, ఈ సాయంత్రం 6.30గంటలకు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఖర్గేతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మే చివరి వారంలో పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభం..?

దేశ రాజధానిలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో (Central Vista) భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనం (New Parliament) ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోందని.. మే చివరినాటికి సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారికంగా తేదీని మాత్రం నిర్ణయించలేదని తెలిపాయి. దీంతో ఈ నెల చివరి వారంలో పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న దృష్ట్యా.. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్ర మంత్రి గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌!

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. దిల్లీ (Delhi)లోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్‌లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరోసారి అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ.. స్వయంగా నోటీసులు అందజేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు చేరుకుని ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) ఆయన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో వెళ్లారు? ఎంత దూరం ఉంది?అనే అంశాలను సీబీఐ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కుక్క కాటుకు గురైన అర్జున్‌ తెందూల్కర్‌..

ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians) తరఫున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసి అందరి దృష్టి ఆకర్షించాడు సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar). గత కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే నేడు ప్లేఆఫ్స్‌ రేసులో ముంబయి.. లఖ్‌నవూ(LSG vs MI)తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో అర్జున్‌ తనను కుక్క కరిచిందని వెల్లడించాడు. స్టేడియంలో లఖ్‌నవూ ఆటగాడు యుధ్‌వీర్‌తో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అర్జున్‌ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.లావా నుంచి అగ్ని2 5జీ.. కార్డుతో కొనుగోళ్లపై ₹2వేల డిస్కౌంట్‌!

లావా అగ్ని 2 5జీ ఫోన్‌.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌లో వస్తోంది. ఒకే ఒక్క రంగులో లభిస్తుంది. దీని ధరను రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌లో మే 24 ఉదయం 10 గంటల నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రధాన బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుతో కొనుగోలు జరిపినా రూ.2000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అంటే ఫోన్‌ రూ.19,999,కే లభించనుందన్నమాట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జొమాటోలోనూ యూపీఐ సేవలు.. ఇక CODకి స్వస్తి?

ప్రముఖ ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato) యూపీఐ (UPI) సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు.. గూగుల్‌ పే, ఫోన్‌ పే తరహా థర్డ్‌ పార్టీ యాప్స్‌తో పనిలేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్‌ చేయొచ్చు. ఇందుకోసం యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు చాలా మంది యూపీఐ సేవలను వాడుతున్నారని, అందుకే ఐసీఐసీఐ (టెక్నాలజీ పార్టనర్) సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కృత్రిమ తీపి పదార్థాలు బరువు తగ్గిస్తాయా..? WHO ఏమందంటే..!

కేలరీలు ఉండవని.. తద్వారా బరువు నియంత్రణ (Weight Control)కు సహాయపడతాయని భావిస్తూ కొంతమంది చక్కెర (Sugar)కు బదులుగా కృత్రిమ తీపి పదార్థాల (Non Sugar Sweeteners)ను వాడుతుంటారు. అయితే, బరువు నియంత్రణలో వాటితో ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో కృత్రిమ తీపి పదార్థాలను వినియోగించవద్దని తన తాజా సిఫార్సుల్లో (WHO Guidelines On NSS) పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీసులను చూసి పరుగులు పెట్టిన పాక్‌ మాజీ మంత్రి..

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) అరెస్టుతో పాకిస్థాన్‌ (Pakistan)లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఇమ్రాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు పాల్పడిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్లాబామాద్‌ హైకోర్టు (Islamabad High Court) వద్ద మంగళవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూసిన ఓ మాజీ మంత్రి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ప్రయాణికులకు సారీ చెప్పేందుకు.. తైవాన్‌ నుంచి జపాన్‌కు ఎయిర్‌లైన్స్‌ అధిపతి!

అనుకోని పరిస్థితుల్లో విమానాలు ఆలస్యమవడం లేదా రద్దయినప్పుడు ప్రయాణికులు (Airline Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎయిర్‌లైన్‌ సంస్థలు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. కొన్నిసార్లు గంటలు గంటలు ఎయిర్‌పోర్టు (Airport)లో ఎదురుచూడాల్సి వస్తుంది. తాజాగా తైవాన్‌కు చెందిన స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ (Starlux Airlines) విమాన ప్రయాణికులకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్‌ (Japan) ఎయిర్‌పోర్టులో వారు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్‌ అధిపతి.. స్వయంగా ఆ దేశానికి వెళ్లి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని