Top 10 News @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Apr 2021 17:46 IST

1. Inter Exams: ఏపీలో 1,452 సెంటర్లు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను మంత్రి వివరించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిమిత్తం 1,452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘పది’ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాల

2. టీకా తీసుకుంటే..94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!

కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణంబారిన పడే ప్రమాదం నుంచి గట్టెక్కినట్లేనని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. ‘Oxygenలేక చనిపోవడం దేశానికే అవమానం’

కరోనా సమయంలో ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని ఆయన కోరారు. వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి  యుద్ధ ప్రాతిపదికన పెరగాలన్నారు. వ్యాక్సిన్‌ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణకు చేరిన 3లక్షల టీకా డోసులు

4. గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి

ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాల్లో కథానాయికగా అలరించారు నటి ప్రియమణి. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో పాటు, పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు, ‘హిజ్‌ స్టోరీ’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇందులో ఆమె సాక్షి అనే చెఫ్‌ పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి స్పందిస్తూ..‘‘ఈ చిత్రంలో నేను చెఫ్‌గా నటించాను. కానీ, నిజంగా నాకు కోడి గుడ్డు ఉడకబెట్టడం కూడా తెలియదు’’అని చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మంత్రులవే ప్రాణాలా? విద్యార్థులవి కాదా?

కరోనా తీవ్రత దృష్ట్యా మంత్రివర్గ సమావేశం వాయిదా వేయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. పది, ఇంటర్‌ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. సీఎంవి, మంత్రులవే ప్రాణాలా? లక్షల మంది విద్యార్థులవి ప్రాణాలు కావా? అని నిలదీశారు. ఇంటి నుంచి సచివాలయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్యరక్షణ ఏర్పాట్ల మధ్య వెళ్లి 30 మందితో దూరంగా ఉండి పాల్గొనే మంత్రివర్గ సమావేశం వల్ల కరోనా సోకుతుందని భయపడి వాయిదా వేయించారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పరీక్షల రద్దు కోరుతూ కేఏ పాల్‌ దీక్ష

6. Drugs Case: ఈడీకి వివరాలు ఇవ్వరెందుకు?

డ్రగ్స్‌ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడంలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలుచేసిన పిల్‌పై విచారణ జరిపింది. 2016 నాటి కేసులు సీబీఐ, ఈడీకి ఇవ్వడంలేదంటూ న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్‌ అధికారులు డ్రగ్స్‌ కేసు వివరాలను తమకు ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది.ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఊగిసలాట ధోరణిలో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 32 పాయింట్ల లాభంతో 49,765 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 14,894 స్థిరపడ్డాయి. ఉదయం భారీ లాభాల్లో మొదలైన మార్కెట్లు మెల్లగా నష్టాల్లోకి  జారుకొన్నాయి. చివరకు కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. మంగళూరు రిఫైన్‌, ఎక్సెలియా సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ, మేగమణి ఆర్గానిక్స్‌, సెయిల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సింగ్ని ఇంటర్నేషనల్‌, క్రాప్టన్‌ గ్రీవ్‌స్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కళ్లు చెదిరే లాభాల్లో హెచ్‌యూఎల్‌..!

8. కూకట్‌పల్లి ఏటీఎం సిబ్బందిపై కాల్పులు

హైదరాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లిలోని ఏటీఎం సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. యంత్రంలో డబ్బులు నింపుతుండగా అల్వీన్‌ కాలనీవైపు నుంచి పల్సర్‌ వాహనంపై బ్యాంకు వద్దకు వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IPL: ఇకనైనా సన్‌‘రైజింగ్‌’ కాకపోతే కష్టమే?

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బరిలోకి దిగి.. మొదట్లో తడబడినా తర్వాత అనూహ్యంగా పుంజుకోని ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్తేమికాదు. అయితే, ఈ సారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమై ప్లే ఆఫ్స్‌ రేసులో చాలా వెనుకబడి ఉంది. ఇక నుంచైనా సన్‌‘రైజ్‌’ కాకపోతే వార్నర్‌ సేన లీగ్ దశలో ఇంటి ముఖం పట్టే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించండి

కొవిడ్‌-19 మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా కేంద్రానికి రాసిన లేఖలో కొవిడ్‌-19 సంక్షోభాన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని ఠాక్రే కోరినట్లు వెల్లడించారు. సుప్రీం, హైకోర్టులు కరోనా తీవ్రతను చూసి ఆందోళ చెందుతున్నాయని ఇలాంటి సందర్భంతో జాతీయ విపత్తు ప్రకటించడం దేశానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

vaccination: భారత్‌లో 15కోట్లు దాటింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని