Top Ten News @ 5 PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 20 Jun 2021 16:54 IST

1. ఆ రోజులు గుర్తొస్తే భయమేస్తుంది: కేసీఆర్‌
సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, సమీకృత కలెక్టరేట్‌, ఆధునిక సదుపాయాలతో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగారని.. తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతంలో తాగు, సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 

KTR: వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ పెట్టండి
తెలంగాణ‌కు భాజ‌పా ఏం చేసింది?: నిరంజ‌న్‌రెడ్డి

2. AP News: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ‌ 
నెల్లూరు జిల్లా పైడేరు కాలువ‌లో వైకాపా నేతల మ‌ట్టి మాఫియాను ప్ర‌శ్నించినందుకు మ‌ల్లికార్జున్ అనే ఎస్సీ యువ‌కుడిపై వైకాపా కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. మ‌ల్లికార్జున్‌ను త‌ప్పుడు కేసులో ఇరికించిన కొడవ‌లూరు పోలీసుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌కు లేఖ రాశారు. పోలీసులు అధికార పార్టీ నాయ‌కుల‌తో చేతులు క‌లిపి ఎస్సీ యువ‌కుడిపై దాడి చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా పోలీసుల చ‌ర్యలు ఉన్నాయ‌ని తెలిపారు.

3. వచ్చేవారంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రారంభం
మహానగరంలో ఎంఎంటీఎస్‌  రైలు సేవలు వచ్చే వారంలో పునః ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలకు అవస్థలు పడుతున్నారు. 5, 10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు దాదాపు రూ.100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు పునః ప్రారంభంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయం కలుగుతుందని కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

HCU ప్రవేశ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌

4. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం కుదరదు
కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులన్నీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. 

5. Unlock: అవసరమైనవే తెరవండి: సీఐఐ

కరోనా మూడో దశ ఉద్ధృతి పొంచి ఉన్న నేపథ్యంలో అన్‌లాక్‌ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు టి.వి.నరేంద్రన్‌ సూచించారు. సరఫరా గొలుసు వ్యవస్థను పునరుద్ధరించే కార్యకలాపాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తద్వారా ఆర్థిక వృద్ధి ఊపందుకోవడంతో పాటు ప్రజలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ‘‘అన్నింటినీ తెరవడం కంటే, ఏ కార్యకలాపాలు అత్యవసరమో వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ అనేది తప్పనిసరి చేపట్టాల్సిన పని. అదే సామాజిక కార్యక్రమాలను అనుమతించేందుకు మరికొన్ని రోజులు వేచి ఉండొచ్చు. ముప్పును కొని తెచ్చుకోవడం ఎందుకు’’ అని నరేంద్రన్‌ వ్యాఖ్యానించారు. 

6. China: 100 కోట్ల డోసులను పంపిణీ చేసిందట!

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు  100కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీ నుంచి పంపిణీ వరకు గోప్యత పాటిస్తోన్న చైనా, తాజాగా 100 కోట్ల మార్కును దాటినట్లు ప్రకటించింది. మొత్తం జనాభాలో ఎంతశాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు..? ఒకటి, రెండు డోసులకు సంబంధించిన వివరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 260కోట్ల డోసులను పంపిణీ చేశారు. వీటిలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈయూ, అమెరికా, భారత్‌ దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్నాయి. 

7. China spy: అదే నిజమైతే.. చైనా సీక్రెట్స్‌ అమెరికా చేతికి..!

గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై చైనా కూడా ఆచితూచీ వ్యవహరిస్తోంది. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్రటరీ విభాగంలో వైస్‌ మినిస్టర్‌గా  పనిచేస్తున్న డాంగ్‌ జింగ్‌వుయ్‌ అదృశ్యంపై డ్రాగన్‌ ఆందోళన చెందుతోంది. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు. నిజంగానే డాంగ్‌ అమెరికాకు పారిపోతే మాత్రం చైనా గూఢచర్య నెట్‌వర్క్‌కు చావుదెబ్బ తగిలినట్లే. డాంగ్‌ జింగ్‌వుయ్‌ 2018 నుంచి చైనా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్స్‌ వ్యవహారాలకు అధిపతిగా పనిచేస్తున్నారు. 

8. Pakistan: అందుకు అమెరికాను అనుమతించబోం!

అఫ్గానిస్థాన్‌పై చర్యలు చేపట్టేందుకు తమ సైనిక స్థావరాలు లేదా భూభాగాన్ని అమెరికా వినియోగించుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్‌ ఖైదా, ఐసిస్‌,  తాలిబన్‌పై ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకునేందుకు వీలుగా పాకిస్థాన్ భూభాగాన్ని అమెరికా వినియోగించుకునేందుకు అనుమతిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు. పాక్‌ సైనిక స్థావరాల వినియోగానికి సంబంధించిన చర్చల్లో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని అమెరికా అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది.

9. Recruitments: సాంకేతిక రంగంలోనే నియామకాల జోష్‌

కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల ప్రభావంతో మేలో అన్ని రంగాల్లో నియామకాలు తగ్గినప్పటికీ.. సాంకేతికత రంగంలో పుంజుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. చాలా సాంకేతికత రంగ కంపెనీలు విస్తరణ ప్రక్రియలో ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. సైకీ (ఎస్‌సీఐకేఈవై) మార్కెట్‌ నెట్‌వర్క్‌ అనే నియామకాల వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. మొత్తం మీద కొత్త ఉద్యోగాల సంఖ్య 2 శాతం తగ్గింది. బ్యాంకింగ్‌ రంగంలో 12%, రిటైల్‌లో 16%, ఎఫ్‌ఎమ్‌సీజీలో 12% చొప్పున కొత్త నియామకాలు తగ్గగా.. బీమా రంగంలో 5 శాతం వృద్ధి ఉంది. అయితే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, క్లౌడ్, డేటా ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉందని పేర్కొంది. ఈ తరహా విభాగాల్లో నియామకాలు మేలో 12-16 శాతం పెరిగాయి.

10. పడిపోకుండా పట్టుకొనేదీ.. నడిపించేదీ నాన్నే

వెనక్కి పడిపోకుండా పట్టుకొనేది నాన్న.. భయంతో వెనుకంజ వేస్తే భుజం తట్టి ముందుకు నడిపించేదీ నాన్న... అంటూ అంతర్జాతీయ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీమ్‌ఇండియా క్రికెటర్లు. తమ తండ్రులతో అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌.. ఈ మధ్యే తండ్రిని కోల్పోయిన హార్దిక్‌ పాండ్య.. హైదరాబాదీ సొగసరి క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ట్వీట్లు చేశారు. ‘ఒక పాటో.. ఒక సువాసనో.. కొన్ని మనల్ని గతంలోకి తీసుకెళ్లే టైమ్‌ మెషిన్ల లాగా పనిచేస్తాయి. నాకైతే మా నాన్నగారితో గడిపిన బాల్యం అలాంటిదే. అది నన్నెప్పుడూ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. తండ్రుల దినోత్సవం సందర్భంగా అలాంటి ప్రత్యేక ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను.

Wtc Final: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని